
గ్రేటర్లో హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 6 గంటలు భారీ వర్షం దంచికొట్టిన సంగతి తెలిసిందే. రోడ్లులన్నీ ఏరులు కావడంతో ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు, బల్దియా, హెచ్ఎండీఏ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో హైదరాబాద్ పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు పడింది.
ఆదివారం వీకెండ్ కదా అని చక్కగా కల్కీ మూవీని చూస్తున్న ప్రేక్షకులకు అకస్మాత్తుగా థియేటర్ పై కప్పు నుంచి నీటి చుక్కలు పడ్డాయి. బయట వర్షం పడుతుంటే థియేటర్లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.థియేటర్లో వర్షం నీరు పడుతుంటే నిర్వాహకులు మాత్రం షో నిలిపివేయలేదు.
ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ మూవీ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యాలతో గొడవకు దిగారు. అయితే సినిమా చూసేవారు చూడవచ్చు, వెళ్లేవారు వెళ్లిపోవచ్చు అంటూ థియేటర్ యాజమాన్యం వెటకారపు సమాధానమిచ్చారు. దీంతో అసహనానికి గురైన ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు.