
ఏపీ భవన్ లో హరిహర వీరమల్లు చిత్ర స్పెషల్ షోలు
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రదర్శిస్తున్నారు.
తెలుగు అధికారుల కోసమే..
వారాంతపు సెలవు దినాలు అయిన శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేస్తున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ లవ్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారి కోసం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
శనివారం రాత్రి 7 గంటలకు మొదటి షో వేయగా ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయింది. 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరో షో వేయనున్నారు. ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది.
ప్రేక్షకుల రెస్పాన్స్
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. గురువారం రోజు జూలై 24న ఈ చిత్రం విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. కానీ తొలిరోజు ఈ చిత్రం దాదాపు 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఈ చిత్రంలో తొలి అర్ధ భాగం బావుందని ప్రేక్షకులు అంటున్నారు. కానీ రెండవ అర్ధ భాగం సరిగ్గా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసినట్లు చెబుతున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ పలు వేదికలపై హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీతం ప్రాణవాయువు అని కొనియాడారు.