
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా హరిహర వీరమల్లు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ఐదేళ్లు కొనసాగింది. పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఏఎం రత్నం, దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు. జూలై 3న ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోయింది. ట్రైలర్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ వీరమల్లుగా ఎలా కనిపించబోతున్నారు లాంటి విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరుకునే మూమెంట్ వచ్చేసింది. ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 2 నిమిషాల 57 సెకన్ల నిడివితో ట్రైలర్ రిలీజ్ అయింది.
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ చేసే అరాచకాలు చూపిస్తారు. ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్.. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికెళ్ళ భరణి డైలాగ్ చెప్పినప్పుడు గుర్రాన్ని ఛేజ్ చేస్తూ పవన్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తారు. ఈ షాట్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.
ఇప్పటి వరకు మేకల్ని తినే పులుల్ని చూసి ఉంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్. చివర్లో బాబీ డియోల్ ఆంధీ వచ్చేసింది అని పవన్ ని తుఫాన్ తో పోల్చడం మరో హైలైట్. ఓవరాల్ గా హరిహర వీరమల్లు ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. కీరవాణి అందించిన బిజియం ట్రైలర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది అని చెప్పొచ్చు.