
తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా నటించి ఆకట్టుకున్నారు ఫిష్ వెంకట్. విలన్ పాత్రలతో మెప్పించిన ఆయన ఆ తర్వాత కామెడీ రోల్స్ వైపు టర్న్ తీసుకుని కామెడీ విలన్‌గా అలరించారు. మెయిన్ విలన్ పక్కన ఉంటూ తనదైన తెలంగాణ పంచ్‌లతో నవ్వులు పూయించారు.
రెండున్నర దశాబ్దాలకుపైగా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఫిష్ వెంకట్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు.
గతంలో కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలో కాస్త బెటర్ అయిన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మళ్లీ సీరియస్‌గా మారింది.
ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షిణించినట్టు తెలుస్తోంది. కిడ్నీలు ఫెయిల్ కావడంతో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నారు.
దీంతో కాస్త బెటర్ అయ్యారు, కానీ ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించిందట. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన ఎవరినీ గుర్తు పట్టలేని స్థితిలో ఉండటం బాధాకరం.
దీనికితోడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయట. నిత్యం వైద్య ఖర్చులకు ఉన్నదంతా పెట్టినట్టు, ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కూతురు వేడుకుంటున్నారు. వెంకట్‌కి డయాలసిస్ చేస్తున్నట్టు వారు వెల్లడించారు.
ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే మెరుగైన వైద్యం అందించడానికి వీలుంటుందని, ఆయన కోలుకునే అవకాశం ఉందని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇక ఫిష్ వెంకట్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ తనదైన పంచ్ లతో నవ్వులు పూయించారు. విలన్ పక్కన ఉంటూ ఫన్నీగా రౌడీయిజం చేస్తూ ఆకట్టుకున్నారు. `ఖుషి`, `ఆది`, `దిల్` వంటి చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు.
ఆ తర్వాత వరుసగా ఆఫర్లని అందుకుంటూ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. దాదాపు అందరు పెద్ద హీరోలతో కలిసి నటించారు. చిన్న హీరోలతోనూ సినిమాలు చేశారు. చివరగా ఆయన `కాఫీ విత్ కిల్లర్` చిత్రంలో నటించారు. ఇది ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.