మెగాడాటర్ నీహారిక 'ఒక మనసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమా నిరాశ పరచడంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది
నటీనటులు: నీహారిక, సుమంత్ అశ్విన్, మురళీశర్మ, సీనియర్ నరేష్ తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
నిర్మాణ సంస్థ: యువి క్రియేషన్స్
దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
మెగాడాటర్ నీహారిక 'ఒక మనసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమా నిరాశ పరచడంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆమె అనుకున్న విజయాన్ని అందించిందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
undefined
కథ:
అక్షర(నీహారిక), ఆనంద్(సుమంత్ అశ్విన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్లికి రెడీ అవుతారు. వారి కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి అంగీకరిస్తారు. అక్షర.. ఆనంద్ కు ముందు విజయ్(రాజా) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వలన వారికి బ్రేకప్ అవుతుంది. ఆ విషయం ఆనంద్ కి కూడా తెలుసు. ఆనంద్ చాలా పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి. అందరినీ ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవడం చేస్తుంటాడు. కానీ అక్షర అలా కాదు.. తనది చాలా కన్ఫ్యూజన్ మైండ్. ఏ నిర్ణయాలు తొందరగా తీసుకోలేదు.. ఒకవేళ తీసుకున్నా మాట మీద నిలబడుతుందని చెప్పలేం. అయితే కొద్దిరోజుల్లో పెళ్లి అనగా తన తప్పు తెలుసుకొని అక్షరకు సారీ చెప్పడానికి వస్తాడు విజయ్. తనకు పెళ్లి అనే విషయం అక్షర చెప్పగా అప్ సెట్ అవుతాడు. ఆమెకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదే సమయంలో అక్షరకి ఆనంద్ తనను లెక్క చేయడంలేదని, ఇంపార్టన్స్ ఇవ్వడం తగ్గించాడని ఫీల్ అవుతుంది. ఓ పక్క పెళ్లి పనులన్నీ జరుగుతుంటే తనకు మాత్రం ఈ పెళ్లి కరెక్ట్ కాదనిపిస్తుందని ఆనంద్ కు చెప్పేస్తుంది. ఈ విషయంపై ఆనంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు..? అక్షర తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందా..? ఆనంద్, విజయ్ లలో ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది..? అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ:
ఈ జెనరేషన్ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు లక్ష్మణ్ ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ కథతో ముందుగా వెబ్ సిరీస్ చేయాలనుకున్నారు కానీ క్వాలిటీ బాగా రావడంతో యువి క్రియేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి సినిమాగా రిలీజ్ చేశారు. అయితే అలా చేసి ఓ పెద్ద తప్పు చేశారని సినిమా చూశాక కచ్చితంగా అనిపిస్తుంది. నిజంగానే ఈ కథతో ఓ షార్ట్ ఫిలిం లేదా వెబ్ సిరీస్ చేసి ఉంటే యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది. కానీ రెండు గంటల సినిమాగా చేసి ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష పెట్టారు. హీరో, హీరోయిన్ పెళ్లికి రెడీ అవుతారు... తన కన్ఫ్యూజన్ మైండ్ తో హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనుకోవడం, ఆమె మనసు మార్చి హీరో పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నం చేయడం.. ఈ అంశాలతో సినిమా మొత్తం నడుస్తుంది. ఒక ప్రేమ జంట. వారి మధ్య గొడవలు, రెండు కుటుంబాలు ఇలా తెరపై ఎంతమంది కనిపిస్తున్నా.. సరైన ఎమోషన్ ను పండించలేకపోయారు.
హీరో తనను రోడ్ మీద వెయిట్ చేయించాడని ఎంగేజ్మెంట్ అయిన తరువాత అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనుకోవడం ఫూలిష్ గా అనిపిస్తుంది. రిలేషన్ లో ఉన్నవాళ్లు కొట్టుకుంటారు.. కలిసిపోతారు. కానీ ఇక్కడ హీరోయిన్ కు కన్ఫ్యూషన్ అనే పాయింట్ యాడ్ చేసి అర్ధం లేకుండా సన్నివేశాలను డిజైన్ చేశారనిపిస్తుంది. అప్పటివరకు ఎంతగానో ప్రేమించిన వ్యక్తిని చిన్న గొడవ కారణంగా కనీసం చూడడానికి కూడా ఇష్టపడకపోవడం వంటి సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. హీరోయిన్ ఎంతగా విసుక్కుంటున్నా.. హీరో మాత్రం నవ్వుతూ ఆమె చుట్టూనే తిరుగుతుంటాడు. 15 నిమిషాల షార్ట్ ఫిలింను రెండు గంటల సినిమాగా తీయడానికి ఆమాత్రం సాగదీయాలి కాబట్టి పెళ్లి పనులు, సంగీత్ లు, గేమ్స్ అంటూ తెరపై డైరెక్టర్ టైమ్ పాస్ చేశాడు. ఇక రొటీన్ క్లైమాక్స్ తో సినిమాను ముగించేశాడు.
హీరోగా సుమంత్ అశ్విన్ తెరపై అతి చేశాడనిపిస్తుంది. నార్మల్ గా నటిస్తే సరిపోయేదానికి ఎగ్జైట్ అవుతూ తన నటనతో విసిగించాడు. పతాక సన్నివేశాల్లో డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. వర్కవుట్ కాలేదు. ఇకనైనా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండే కథలను ఎన్నుకుంటే హీరోగా రాణించగలడు. ఇక హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి నీహారిక చేసే ప్రయత్నాలు ఎంతమాత్రం పని చేయడం లేదు. తెరపై రెండు గంటల పాటు ఆమెను చూడడం కాస్త కష్టమే అనిపిస్తుంది. ఒకటే ప్యాటర్న్ డ్రెస్సులు వేస్తూ, ఎలాంటి కొత్తదనం లేని తన నటనతో ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఆమె ముఖంలో ఎలాంటి ఎమోషన్ కనిపించదు ఇక ఆడియన్స్ మాత్రం ఆమె పాత్రకు ఎలా కనెక్ట్ అవుతారు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా పండలేదు. నీహారిక కంటే ఆమె స్నేహితురాలిగా కనిపించిన పూజిత పొన్నాడ లుక్స్ పరంగా ఆకట్టుకుంటుంది. రాజా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ ఎప్పుడూ కూతురిని సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో ఓకే అనిపించాడు. కానీ సీనియర్ ఆర్టిస్టుల పాత్రలు ఎలివేట్ అవ్వలేదు. తెరపై ఆర్టిస్టులు ఎక్కువగా కనిపించాలని అందరినీ తీసుకున్నట్లు ఉన్నారు. ఇంద్రజ ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలో కనిపించింది.
అతి తక్కువ బడ్జెట్ లో సినిమాను సింపుల్ గా పూర్తి చేసేశారు. సినిమాటోగ్రఫీ, పాటలు అన్నీ కూడా కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఫిదా సినిమాకు పని చేసిన శక్తికాంత్ కార్తిక్ ఈ సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా చేయలేకపోయాడు. కథలో బలం, బలమైన సన్నివేశాలు లేనప్పుడు పాటలు మాత్రం బాగుండాలని మనం కూడా ఆశించలేం. షార్ట్ ఫిలిమ్స్ చేసే లక్ష్మణ్ కు ఈ సినిమాతో దర్శకుడిగా మంచి అవకాశం ఇచ్చారు. మేకింగ్ పరంగా అతడి మార్క్ ఎక్కడా కనిపించదు. రెగ్యులర్ సినిమాల మాదిరి అనిపిస్తుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా వారికి కనెక్ట్ అవ్వడం కష్టమే.. కనీసం మూడు రోజులైనా ఈ సినిమా థియేటర్ లో ఉంటే గొప్పే..
రేటింగ్: 1.5/5