
హీరోలందరికీ అభిమానులు ఉండటం సహజం. ఆ అభిమానంతో తమ హీరోల సినిమాలన్నింటినీ.. విడుదలైన మొదటి రోజు.. మొదటి షో చూసేస్తారు. తమ అభిమాన హీరో ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చాడంటే అక్కడికి వెళ్లిపోతారు. వాళ్ల సినిమా విడుదలైతే.. బ్యానర్లు కట్టి సందడి చేస్తారు. ఇలాంటి పనులు దాదాపు హీరోలందరికీ చాలా మంది అభిమానులు చేస్తారు.
కానీ ఈ ఎన్టీఆర్ అభిమాని మాత్రం కొంచెం స్పెషల్. జై లవ కుశ సినిమా గురువారం విడుదలవ్వబోతోంది. మీలో చాలా మంది బెన్ఫిట్ షో టిక్కెట్లు కొని ఉంటారు. ఎంత పెట్టి కొంటారు? రూ.500, రూ.1000 లేదంటే మహా అయితే రూ.2వేలు పెట్టి కొని ఉంటారు. అవునా.. కానీ గుంటూరుకి చెందిన హరి అనే ఓ అభిమాని ఏకంగా రూ.లక్ష పెట్టి జై లవ కుశ టికెట్ కొన్నాడు.
ఆ రూ.లక్ష ను గుంటూరు ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారట. మాములుగా సినిమా చూడాలంటే సాధారణ ధరకే టికెట్ కొనుక్కోవచ్చు. కానీ ఆయన ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే రూ.లక్ష పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. దీంతో ఈయన గురించి విన్నవారంతా.. అభిమాన మంటే ఇదే కదా అంటున్నారు.