
హీరో గోపీచంద్‌కి ఇటీవల సరైన హిట్లు లేవు. ఆ మధ్య `సీటీమార్` చిత్రం ఫర్వాలేదనిపించుకోగా, ఆ తర్వత వచ్చిన `పక్కా కమర్షియల్` బోల్తా కొట్టింది. ఇప్పుడు గోపీచంద్ సక్సెస్ మ్యాండేటరీగా మారింది. దీంతో `లక్ష్యం`, `లౌక్యం` వంటి హిట్ చిత్రాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో `రామబాణం` చిత్రం చేశాడు. హ్యాట్రిక్ హిట్‌కి సిద్ధమవుతున్నారు. డింపుల్ హయతి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నెల 5న సినిమా రిలీజ్ కాబోతుంది.
అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కథేంటి? అనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ చూస్తుంటే ఇది నితిన్ హీరోగా నటించిన `భీష్మ` చిత్రానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా ఆర్గానిక్ ఫుడ్ నేపథ్యంలో సాగుతుందట. సినిమాలో గోపీచంద్, జగపతిబాబు అన్నదమ్ములుగా కనిపిస్తారు. బ్రదర్స్ సెంటిమెంట్ ప్రధానంగా సినిమా సాగుతుందని, బ్యాక్ డ్రాప్ ఆర్గానిక్ ఫుడ్ అని సమాచారం. అయితే జగపతిబాబు ఆర్గానిక్ ఫుడ్‌ని పండిస్తూ మంచి పేరుతెచ్చుకుంటాడు. ఆయన్ని జనం దేవుడిగా చూస్తుంటారు. ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పిస్తుంటాడు. దీంతో జనం దృష్టిలో ఆయన గొప్ప వ్యక్తిగా మారిపోతాడు.
అయితే ప్రత్యర్థుల బిజినెస్‌లను జగపతిబాబు ఆర్గానిక్ ఫుడ్ దెబ్బ కొడుతున్న నేపథ్యంలో వాళ్లు ఈ ఆర్గానిక్ ఫుడ్‌ని దెబ్బకొట్టాలని, జనంలో ఉన్న మంచి పేరు పోగొట్టాలని కుట్రలు పన్నుతారు. ఫుడ్‌ని కలుషితం చేస్తారు. దీంతో జనాల ప్రాణాల మీదకు వస్తుంది. జగపతిబాబు ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. దీనికితోడు అన్నదమ్ములు జగపతిబాబు, గోపీచంద్ ల మధ్య గొడవలు పెట్టి ఇద్దరిని విడదీస్తారు. ఈ ఇద్దరు విడిపోయేందుకు వాళ్లు పెట్టిన చిచ్చు ఏంటీ? విడిపోయిన ఈ ఇద్దరు ఎలా కలిశారు? విలన్లని ఎలా ఎదుర్కొన్నారనేది చిత్ర కథ అని తెలుస్తుంది.
అయితే నితిన్, రష్మిక కలిసి నటించిన `భీష్మ` చిత్రం కూడా ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్ తోనే రూపొందింది. అందులోనూ ఈ ఫుడ్ కలుషితమైందని ప్రత్యర్థులు కుట్రలు చేస్తారు. దీంతో హీరో ఆ కుట్రలను భగ్నం చేసి `భీష్మ` కంపెనీకి సీఈవో కావడమనేది కథ. కాస్త అటు ఇటుగా ఈ చిత్రం కాన్సెప్ట్ కూడా సేమ్ ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీవాస్ చెబుతూ, `ఆర్గానిక్ ఫుడ్ పాయింట్ ని కథకు ఎంత అవసరమో అంత వాడాం. ఏ కథ చేయాలన్నా కాన్ ఫ్లిక్ట్ కావాలి. కాన్ ఫ్లిక్ట్ గురించి అలోచించినపుడు.. కరోనా తర్వాత జనాల్లో ఫుడ్ పై అవగాన పెరిగింది. దాని రిలేట్ గా పెడితే ఇంకా కనెక్టింగ్ గా వుంటుందనిపించింది. ఆర్గానిక్ ఫుడ్ పెద్ద సబ్జెక్ట్. ఈ సినిమా కథకు ఎంత కావాలో అంతవరకు చెప్పాం` అని తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, `హర్రర్, డార్క్, రగ్గడ్ సినిమాలు విడుదలై విజయం సాధిస్తే అందరూ అవే సినిమాలు చూస్తారని అనుకుంటాం గానీ.. నాకున్న అనుభవం అవగాహన ప్రకారం, కుటుంబం అంతా కలసి వెళ్లి చూడడానికి ఒక మంచి సినిమా కావాలి. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా రావడం లేదనే వెలితి ఎప్పుడూ వుంటుంది. ఆ వెలితిని `రామబాణం` భర్తీ చేస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం అంత తేలిక కాదు. అది సేఫ్ జోనర్ కూడా కాదు. హార్రర్. థ్రిల్లర్స్, యాక్షన్, కొరియన్, ఇంగ్లీష్ చిత్రాలు చూసి ప్రేరణ పొందే అవకాశం వుంది. కానీ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ అలా కాదు. కథ పాత్రలు మన జీవితం నుంచి రావాలి. మనం నిత్యం చూసే పాత్రలోనే కొత్తదనం చూపించడం అంత తేలిక కాదు. నేను ఇలాంటి తరహా సినిమాలు చేయడానికి నేను వచ్చిన నేపథ్యం కారణం కావచ్చు` అని వెల్లడించారు.