
`ది కేరళ స్టోరీ` సినిమా.. విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం. కేరళ ప్రభుత్వాన్ని, కేరళ రాష్ట్రాన్ని అబాసుపాలు చేసే చిత్రంగా ఆ రాష్ట్ర సీఎం ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కేరళలో ఇటీవల కాలంలో సుమారు 32వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారని, వారిలో కొంతమంది బలవంతంగా ముస్లీం మతంలోకి, మరికొందరు ఉగ్రవాదాలుగా మార్చబడ్డారని, అనేక చిత్ర హింసలకు గురిచేయబడ్డారని ఈ సినిమాలో చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీగా మారింది.
ఈ సినిమా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజకీయ ఎజెండా ఫిల్మ్ గా కేరళ కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ రాష్ట్రలో బీజేపీ పాగా వేయలేకపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసి ఈ రూపంలోనైనా కేరళలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుందని కేరళ కమ్యూనిస్టు నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రక్రియ నడుస్తుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము యదార్థాలను చూపిస్తున్నామని చిత్ర బృందం చెబుతుంది. సినిమా చూశాక మాట్లాడాలని చిత్ర దర్శకుడు తెలిపారు. ఇది మతాలకు వ్యతిరేకం కాదని, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకమైన చిత్రమని ప్రధాన పాత్రలో నటించిన ఆదా శర్మ తెలిపింది. ఇప్పుడీ సినిమాపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. వివాదాలకు కేరాఫ్‌గా మారుతుంది. ఈ నెల 5న పాన్ ఇండియా తరహాలో హిందీతోపాటు సౌత్ లాంగ్వేజెస్‌లోనూ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి తమిళనాడులో అడ్డంకులు ఎదురు కాబోతున్నాయి. ఈ సినిమాని విడుదల ఆపేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ సినిమాకి కేరళలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, తమిళనాడులో విడుదల చేస్తే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిపాయని సమాచారం. అందుకే తమిళనాడులో `ది కేరళ స్టోరీ` సినిమా విడుదలకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా సంస్థ సిఫార్సు చేసిందని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం తమిళనాడులో విడుదలపై సందిగ్దత నెలకొంది. మరి తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆదాశర్మతోపాటు సిద్ధి ఇద్రానీ, సోనియా బలానీ, యోగితా బిహానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ రూపొందించగా, విపుల్ అమృత్ షా నిర్మించారు. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిగిలిన భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. మే 5న రిలీజ్ చేయబోతున్నారు. విడుదలకు ముందు ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుందో చూడాలి.