
మహేష్‌బాబు(Maheshbabu) నటించిన `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata) మే 12న విడుదలై ఆకట్టుకుంది. కీర్తిసురేష్(Keerthy Suresh) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మించాయి. ఈ చిత్రం సుమారు రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం వెల్లడించింది. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో రన్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడయ్యింది. సినిమాలో మరో పాటని జోడించారు. `మురారి వా `(Murari Va)అంటూ సాగే పాటని మొదట తొలగించిన విషయం తెలిసిందే. పాట ఫిట్ కావడం లేదని, పక్కన పెట్టారు. ఆ పాట స్థానంలో `మ మ మహేషా` సాంగ్‌ని పెట్టారు. చివరి నిమిషంలో సినిమాకి ఊపు తీసుకురావడంలో ఈ పాటని చిత్రీకరించి జోడించారు. దీని కారణంగా `మురారి` పాటని లేపేశారు.
అయితే ఆ పాటని డైరెక్ట్ గా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తామని తెలిపింది యూనిట్. దీంతో పాట కోసం మహేష్ అభిమానులే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర బృందం అదిరిపోయే ప్లాన్ చేసింది. ఈ పాటని డైరెక్ట్ గా సినిమాలోనే యాడ్ చేశారట. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమాలో ఈ పాటని యాడ్ చేశామని తెలిపారు. గురువారం నుంచి ఈ పాటతో కలిసి సినిమా థియేటర్లలో ప్రదర్శితం కాబోతుందని చెప్పారు. మరోసారి ఆడియెన్స్ ని థియేటర్ రప్పించేందుకు యూనిట్ చేసిన ప్లాన్ ఇది. జనరల్ ఆడియెన్స్ రాకపోయినా, మహేష్ అభిమానులైనా వస్తారని నిర్మాతల ఆశ.
ఎందుకంటే ఈ చిత్రం ఇప్పటికే చాలా లాస్‌లో ఉంది. కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. పైకి ప్రకటించిన కలెక్షన్లకి, ఒరిజినల్ కలెక్షన్లకి పొంతనే లేదు. వంద కోట్లలోపే ఈ సినిమాకలెక్షన్లు వచ్చాయని సమాచారం. ఇంకా చెప్పాలంటే షేర్ 60కోట్లు దాటలేదని బయ్యర్ల నుంచి వినిపించిన టాక్. దీంతో ఈ పాటని జోడించడం వల్ల కొంతైనా కలెక్షన్లు యాడ్ అయ్యే అవకాశం ఉందని యూనిట్ భావించిందట. అందుకే యూట్యూబ్‌లో కాకుండా డైరెక్ట్ గా సినిమాలోనే యాడ్ చేసినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.