గాంధీజీ జయంతిని ఈ సినిమాలతో సెలబ్రేట్ చేసుకోండి, ఆయనపై తెరకెక్కిన బెస్ట్ మూవీస్!

By Sambi ReddyFirst Published Oct 2, 2024, 9:46 AM IST
Highlights

నేడు మహాత్ముడు గాంధీ జయంతి. ఆయన ఔన్నత్యం చాటుతూ కొన్ని చిత్రాలు తెరకెక్కాయి. ఆ చిత్రాల లిస్ట్ మీకోసం.. 
 

ఎందరో మహనీయుల త్యాగఫలం స్వాతంత్ర్యం. వారిలో ముందుగా వినిపించే పేరు గాంధీజీ. జాతిపితగా ఖ్యాతిగాంచిన గాంధీ ప్రపంచానికి శాంతి మార్గం చూపారు. అహింస ద్వారా కూడా యుద్దాన్ని గెలవొచ్చని నిరూపించారు. 

1869 అక్టోబర్ 2న జన్మించిన గాంధిజీ జయంతి నేడు. గాంధీ జీవితం అనేక తరాలకు స్ఫూర్తి దాయకం. ప్రపంచం మొత్తం గాంధీజీ సిద్ధాంతాలను కొనియాడింది. ఆయన్ని శాంతి దూతగా గుర్తించింది. నా జీవితమే నా సందేశం అని చెప్పాడు గాంధీ. అంతటి స్ఫూర్తివంతమైన, ఆదర్శ దాయకమైన జీవన శైలి అవలంభించాడు. చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు.

Latest Videos

ఆయన గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు కొన్ని సినిమాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన మీద తెరకెక్కిన కొన్ని చిత్రాలు చూద్దాం... 

గాంధీజీ పై హాలీవుడ్ మూవీ 

1982లో వచ్చిన 'గాంధీ' చిత్రంలో గాంధీగా హాలీవుడ్ నటుడు బెన్ కింగ్ స్లే గొప్పగా నటించారు. రిచర్డ్ అటెన్ బరో రూపొందించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. అప్పట్లో భారీ విజయం సాధించింది. జాన్ బ్రిలే రచయితగా పని చేశారు. బెన్ కింగ్ స్లే కి గాంధీజీ గెటప్ చక్కగా కుదిరింది. $ 22 మిలియన్స్ బడ్జెట్ తో నిర్మించారు. $127 మిలియన్ కి పైగా వసూళ్లను గాంధీ చిత్రం రాబట్టింది.  

గాంధీ మూవీ అనంతరం `ది మేకింగ్ ఆఫ్ మహాత్మ` అనే చిత్రం తెరకెక్కింది. ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనగల్ ది మేకింగ్ ఆఫ్ మహాత్మ చిత్రానికి దర్శకత్వం వహించారు. సౌత్ ఆఫ్రికాలో గాంధీ ఎదుర్కున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని నడిపించారు. గాంధీజీ శాంతి, అహింసా మార్గాలు ఎంచుకోవడానికి స్ఫూర్తిగా నిలిచిన సంఘటనలతో రూపొందించారు. 

రాజిత్ కపూర్ గాంధీ పాత్ర చేశారు. పల్లవి జోషి కస్తూర్ భా గా కనిపించింది. ఫాతిమా మీర్ రచయితగా పని చేశారు. ఈ మూవీని 1996లో ఇంగ్లీష్ లో విడుదల చేశారు. దేశభక్తులు చూడాల్సిన చిత్రం. 

కమల్ హాసన్ తెరకెక్కించిన హే రామ్ 

ఇక 2000 సంవత్సరంలో  కమల్ హాసన్ హీరోగా వచ్చిన చిత్రం హే రామ్. ఈ చిత్రం వివాదాస్పదమైంది. కమల్ హాసన్ రచించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన అద్భుతంగా ఉంటుంది. హే రామ్ విడుదలకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. షారుక్ ఖాన్ ఈ చిత్రంలో  అతిథి పాత్రలో కనిపించారు. 

హేమ మాలిని, రాణి ముఖర్జీ, నసీరుద్దీన్ షా వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. గాంధీజీ సిద్ధాంతాలను హే రామ్ మూవీలో ప్రస్తావించారు. ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. నిర్మాతగా కమల్ హాసన్ నష్టపోయారు. 

2006లో గాంధీజీ మార్గం ఈ తరానికి అర్థం అయ్యేలా లగేరహో మున్నా భాయ్ అనే చిత్రం చేశారు. సంజయ్ దత్ హీరోగా నటించారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన లగేరహో మున్నాభాయ్ సూపర్ హిట్. అర్షద్ వార్సి కీలక రోల్ చేశాడు. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించింది. 

ఒక రౌడీ గాంధీ భావజాలానికి ఎలా ప్రభావితం అయ్యాడు. అతనిలో వచ్చిన మార్పు ఏమిటనేది కమర్షియల్ యాంగిల్ లో చక్కగా చెప్పారు. మున్నాభాయ్ ఎంబిబిఎస్ కి ఈ చిత్రం సీక్వెల్ కాగా, కాసుల వర్షం కురిపించింది. 

గాంధీజీ పై చిరంజీవి చిత్రం 

లగేరహో మున్నాభాయ్` సినిమాను తెలుగులోనూ శంకర్ దాదా జిందాబాద్‌గా రూపొందించారు.  ఈ మూవీలో చిరంజీవి మహాత్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. శంకర్ దాదా జిందాబాద్ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. శ్రీకాంత్ కీలక రోల్ చేశాడు. కరిష్మా కొటక్ హీరోయిన్ గా నటించింది. 2007లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్...  చిరంజీవి ఇమేజ్ రీత్యా తెలుగులో పరాజయం పాలైంది. 

ఇక గాంధీ జీవితంపై ఎమోషనల్ డ్రామాగా `గాంధీ మై ఫాదర్` మూవీ తెరకెక్కింది. ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో బెస్ట్ అనొచ్చు. ఈ చిత్రానికి ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకుడు. అక్షయ్ ఖన్నా, షెఫాలీ షా ప్రధాన పాత్రలు చేశారు. గాంధీ మై ఫాదర్ 2007లో విడుదలైంది. 

గాంధీజీ భావాలను తనదైన శైలిలో చెప్పిన కృష్ణవంశీ 

దర్శకుడు కృష్ణ వంశీ మహాత్మ టైటిల్ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించారు. శ్రీకాంత్ వందవ చిత్రంగా తెరకెక్కిన మహాత్మ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్ నటన, డైలాగ్స్ బాగుంటాయి. భావన హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం, ఉత్తేజ్ కీలక రోల్స్ చేశారు. 

ఈ చిత్రంలో సాంగ్స్ బాగుంటాయి. గాంధీజీ గొప్పతనాన్ని చాటుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన.. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ... సాంగ్ చాలా బాగుంటుంది. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం మరొక విశేషం. కృష్ణవంశీ గాంధీజీ భావాలను తనదైన కోణంలో చెప్పే ప్రయత్నం చేశాడు. 
బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

click me!