రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న `గేమ్ ఛేంజర్` సినిమా నుంచి మొదటి పాట విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడిందట. అయితే దీనికి సంబంధించిన అసలు కారణం బయటకువచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్`(Game Changer) మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. దిల్ రాజు దీన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇటీవల దీపావళికి `జరగండి జరగండి` అంటూ సాగే ఫస్ట్ సాంగ్ వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ కలర్‌ఫుల్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. దీంతో రామ్‌చరణ్ అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది. దీనికితోడు ఈ పాటకి సంబంధించిన వార్తలు మరింత ఆసక్తిని పెంచాయి.
ఈ పాటలో ఉన్న ఇళ్లు అంతా సెట్ వర్క్ అట. భారీగా ఖర్చు చేసి ఈ ఇళ్లని సెట్ వేశారని తెలిసింది. దీంతో ఈ పాటపై మరింత ఆసక్తి ఏర్పడింది. దీపావళికి పాట వస్తుందని అంతా భావించారు. కానీ వాయిదా పడిందనే వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. ప్రమోషన్స్ ఇప్పట్నుంచి వద్దు అనుకుని వాయిదా వేశారని అంటున్నారు. రిలీజ్ ఇంకా ఆరేడు నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రమోట్ చేస్తే, అప్పటికి స్టఫ్ ఉండదని భావించి టీమ్ ఈ పాటని వాయిదా వేశారని ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా ఓ కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. `జరగండి జరగండి` పాటని వాయిదా వేయడానికి మరో కారణం ఉందట. అదే సింగర్‌ని మార్చాలనుకుంటున్నారట. మొదట అనుకున్న సింగర్ పాడిన సాంగ్ అంతగా ఆకట్టుకోలేదని, దీంతో వేరే సింగర్‌తో పాడించాలని నిర్ణయించుకున్నారట. పాటపై భారీ అంచనాలుండటం, అదొక విజువల్ ట్రీట్‌లా సాంగ్ విజువలైజేషన్ ఉండటంతో ఆ స్థాయిలో పాట రాలేదని, అందుకే మరో సింగర్‌తో పాడించాలని భావిస్తున్నారట. అందుకే వాయిదా వేసినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న `గేమ్ ఛేంజర్` మూవీలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఒక పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్ అధికారికగా కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే రెండు లుక్‌లు బయటకు వచ్చాయి. ఇక ఆయనకు జోడీగా కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్‌రాజు దాదాపు 350కోట్ల బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.