
తన అభిమానులకు, సినిమా కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. క్యాన్సర్‌ని ముందస్తుగా గుర్తించడం వల్లే చికిత్స చేయడం ఈజీ అవుతుందని, ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు ఆస్కారం ఉంటుందని చిరంజీవి వెల్లడించారు. స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్టు చిరంజీవి ప్రకటించారు.
శుక్రవారం దీనికి సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి వివరాలు వెల్లడించారు. స్టార్ ఆసుపత్రి డైరెక్టర్ మన్నే గోపీచంద్, వైద్యులు సాయి, బిపిన్‌లతో కలిసి చిరంజీవి ఈ విషయాలను తెలిపారు. తన అభిమానులు, సినిమా కార్మికులకు సైతం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తామని చిరంజీవి తెలిపారు. జులై 9న హైదరాబాద్, జులై 16న వైజాగ్, జులై 23న కరీంనగర్‌లో రోజుకి వెయ్యి మందికి చొప్పున వివిధ క్యాన్సర్లకి సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్టు చిరంజీవి వెల్లడించారు.
అభిమానులు, సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాదు, చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలోనూ కొంత భరిస్తామని తెలిపారు. ఎంత మొత్తం అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోసారి వైద్యులతో మాట్లాడి చెబుతానని అన్నారు చిరు. సినీ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని, దాని ద్వారా వాళ్లు భవిష్యత్‌లోనూ చికిత్సలు చేయించుకోవచ్చన్నారు.
క్యాన్సర్ బారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అవగాహన కల్పించేలా సినీ పరిశ్రమ తరఫున ప్రత్యేక షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పన చేయనున్నట్టు చెప్పారు. చిరంజీవి విజ్ఞప్తి మేరకు క్యాన్సర్ స్క్రీనింగ్‌లో భాగంగా వచ్చే నాలుగు నాలుగు నెలల ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు డాక్టర్ మన్నె గోపీచంద్ తెలిపారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సహృదయంతో ముందుకొచ్చిన చిరంజీవికి తోడుగా తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు డాక్టర్.