థియేటర్లలో అసలు ధరకే ఫుడ్ ఐటమ్స్.. లేదంటే ఫిర్యాదుకి టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!

First Published Jul 30, 2018, 11:41 AM IST
Highlights

ఆగస్టు 1వ తేదీ నుండి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎమ్మార్ఫీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా, రూల్స్ ను ఉల్లఘించినా.. మొదటిసారి పాతికవేలు జరిమానా, రెండో సారి యాభై వేలు జరిమానా విధిస్తారు.

సామాన్యుడు సినిమాకు వెళ్లడానికి కూడా ఆలోచించే రోజులు వచ్చేశాయి. కుటుంబంతో సహా సినిమాకు వెళ్లడం వరకు ఓకే.. అక్కడకి వెళ్లిన తరువాత పిల్లలు అడిగిన ఫుడ్ ఐటమ్స్ కొనలేక ఇబ్బంది పడుతున్నారు పెద్దలు. పాప్ కార్న్ కొందామంటే రూ.300కి పైనే.. ఇక కోక్, సాండ్ విచ్, బర్గర్ ఆఖరికి వాటర్ బాటిల్ కొందామన్నా.. ఈ రేట్లు చూసి వెనక్కి తగ్గాల్సిందే. బయట మార్కెట్ లో అమ్మే ధరలకు, థియేటర్ లో అమ్మే ధరలకు అసలు పొంతనే ఉండదు. ఎమ్మార్ఫీ ధరలకు రెండు, మూడు రేట్లు ఎక్కువ వేసుకొని తినుబండారాలు అమ్ముతున్నారు నిర్వాహకులు.

ఇప్పుడు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లలో ఫుడ్ ఐటమ్స్ ను ఎక్కువ ధరకు అమ్మినట్లు తెలిస్తే వారికి జైలు జీవితం తప్పదని తెలుస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్రం తూనికల కొలతను శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని విధివిధానాలను కూడా రూపొందించారు. వాటి ప్రకారం.. ఫుడ్ ఐటమ్స్, శీతల పానీయాలు, వాటర్ బాటిల్స్ ఇలా థియేటర్ లో అమ్మే ప్రతి వస్తువుపై బరువు, తయారు చేసిన తేదీ, ఇప్పటివరకు నిల్వ ఉంటుందనే అంశాలతో పాటు ఎమ్మార్ఫీ స్టిక్కర్ కనిపించే విధంగా ఉండాలి. ఒకవేళ ఎమ్మార్ఫీ మారితే ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి.

ఒకటే రకమైన బ్రాండ్ కు చెందిన ఐటమ్స్ కాకుండా వివిధ రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ఈ విషయాలన్నీ ప్రేక్షకులకు తెలిసే విధంగా బోర్డు పెట్టాలి. ఆగస్టు 1వ తేదీ నుండి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎమ్మార్ఫీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా, రూల్స్ ను ఉల్లఘించినా.. మొదటిసారి పాతికవేలు జరిమానా, రెండో సారి యాభై వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి లక్ష రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఎమ్మార్ఫీ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారని ప్రేక్షకుల దృష్టికి వస్తే.. 180042500333 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి, లేదా 7330774444 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. 

click me!