కృతి శెట్టికి టాలీవుడ్ హీరోలందరూ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఓ మలయాళ హీరో ఆమె కెరీర్ కి ఊపిరిపోశాడు. కృతి శెట్టి భవిష్యత్ కి భరోసా ఇచ్చాడు..
కృతి శెట్టి రెండేళ్ల క్రితం వరకు టాలీవుడ్ సెన్సేషన్. వరుస విజయాలతో దర్శక నిర్మాతల హాట్ ఫేవరేట్ అయ్యారు. హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసిన కృతి శెట్టి లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. అయితే ఒక్కసారిగా ఆమె ఫేట్ మారిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన అమ్మడుకి హ్యాట్రిక్ ప్లాప్స్ పడ్డాయి.
బాల్యం నుండి పలు యాడ్స్ లో నటించిన కృతి శెట్టి సూపర్ 30 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. హృతిక్ రోషన్ నటించిన ఈ బయోపిక్ లో స్టూడెంట్ పాత్రలో నటించి మెప్పించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఉప్పెన మూవీకి హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో హీరోగా పరిచయం అయ్యారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.
ఉప్పెన దాదాపు రూ. 80 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక లాభాలు పంచిన టాలీవుడ్ చిత్రాల జాబితాలో చేరింది. దాంతో కృతి శెట్టికి అవకాశాలు క్యూ కట్టాయి. నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ చిత్రం చేసింది. ఈ చిత్రంలో సాయి పల్లవి మరొక హీరోయిన్. శ్యామ్ సింగరాయ్ కి ప్రేక్షకుల ఆదరణ దక్కింది.
మూడో చిత్రం బంగార్రాజు. పల్లెటూరి అల్లరి పిల్ల పాత్రలో కృతి శెట్టి ప్రేక్షకులను అలరించింది. నాగార్జున, నాగ చైతన్యల ఈ మల్టీస్టారర్ 2022 సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ స్టేటస్ అందుకుంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి కెరీర్ ఒక్కసారిగా తిరోగమనం బాట పట్టింది. బంగార్రాజు అనంతరం కృతి శెట్టి నటించిన ప్రతి మూవీ డిజాస్టర్ అయ్యింది. అనుభవలేమితో వచ్చిన ప్రతి ఆఫర్ కి కృతి శెట్టి సైన్ చేసింది. రామ్ పోతినేని వారియర్, నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
నాగ చైతన్యకు జంటగా నటించిన కస్టడీ మూవీపై కృతి శెట్టి చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఆ మూవీ కృతి శెట్టి ఖాతాలో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. నాగ చైతన్య సైతం కృతి శెట్టికి హిట్ ఇవ్వలేకపోయాడు. శర్వానంద్ తో చేసిన మనమే కృతి శెట్టికి వరుసగా 5వ పరాజయం.
తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో కృతి శెట్టి తమిళ, మలయాళ పరిశ్రమల మీద దృష్టి పెట్టింది. ఆమెకు ఎట్టకేలకు హిట్ పడింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన మలయాళ చిత్రం ARM హిట్ స్టేటస్ సొంతం చేసుకుంది. మాలీవుడ్ స్టార్స్ లో ఒకరైన టోవినో థామస్ హీరోగా నటించాడు. ARM యాక్షన్ అడ్వెంచర్ డ్రామా.
సెప్టెంబర్ 12న కేరళలో విడుదలైన ARM రూ. 100 కోట్ల వసూళ్ల మార్కును చేరుకుందని సమాచారం. ఈ చిత్రంలో ఐశ్యర్య రాజేష్ మరొక హీరోయిన్. జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. ARM హిట్ తో కృతి శెట్టి ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో తెలుగు హీరోలు చేయలేని పని టోవినో థామస్ చేశాడు. హిట్ కొట్టి కృతి శెట్టి కెరీర్ కి భరోసా ఇచ్చాడనే వాదన వినిపిస్తోంది.
తెలుగులో కృతి శెట్టి కెరీర్ ముగిసినట్లే అని చెప్పొచ్చు. శ్రీలీల నుండి ఆమెకు గట్టి పోటీ ఎదురవుతుంది. కృతి శెట్టి ఆఫర్స్ ప్రస్తుతం శ్రీలీల ఖాతాలోకి వెళుతున్నాయి. లుక్స్, డాన్స్, నటన పరంగా కృతి కంటే శ్రీలీల ఓ మెట్టు పైనుంది. బాలకృష్ణ వంటి బడా హీరోలతో సన్నిహిత సంబంధాలు మైంటైన్ చేస్తుంది.
టాలీవుడ్ లో అవకాశాలు కనుమరుగైనప్పటికీ కోలీవుడ్ లో కృతి శెట్టి బిజీ కావడం విశేషం. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. ఏకంగా కార్తీ సరసన ఆఫర్ పట్టేసింది. నాలన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్న వా వాతియారే చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జయం రవికి జంటగా జీనీ చిత్రం చేస్తుంది. మరొక తమిళ చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నట్లు సమాచారం.
2003లో పుట్టిన కృతి శెట్టి వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమే. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే లాంగ్ కెరీర్ ని ఎంజాయ్ చేయవచ్చు. కోలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైతే నెత్తిన పెట్టుకుంటారు. తెలుగులో తిరస్కరణకు గురైన అంజలి, శ్రీదివ్య, హన్సిక వంటి హీరోయిన్స్ కోలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. స్టార్స్ గా వెలిగారు.
దేశంలోని అతిపెద్ద చిత్ర పరిశ్రమల్లో కోలీవుడ్ ఒకటి. నయనతార, త్రిష రెండు దశాబ్దాలకు పైగా కోలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. మరి కృతి శెట్టి కోలీవుడ్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
బిగ్ బాస్ హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?