
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ కు సంబంధించిన ఏ సినిమా ప్రారంభమైనా.. షూటింగ్ అయినా.. ఇతర కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించడంలో అభిమానులు అస్సలే తగ్గనంటున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR), ఆచార్య (Acharya) వంటి మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి అభిమానులను, ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్సీ 15’లో నటిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఎక్కడా ఆలస్యం లేకుండా ప్రస్తుతం త్వరగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తున్నారు దర్శకుడు శంకర్. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్న RC15 టీం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో నెక్ట్స్ షెడ్యూల్ ను ప్రారంభించనుంది. ఇందుకు చిత్ర యూనిట్ ఈ రోజు వైజాగ్ కు చేరుకుంటోంది. ఈ సందర్భంగా చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తమ అభిమాన హీరో రామ్ చరణ్ వైజాగ్ లో షూటింగ్ కు హాజరవుతున్నందున అక్కడి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు స్వాగతం పలుకుతూ నగరంలో భారీగా బైక్ ర్యాలీ తీశారు. అదే ర్యాలీగా వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అదేవిధంగా చరణ్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వైజాగ్ లోని రాడిసన్ హోటల్ కు వెళ్లనున్నారు. ఇందుకు మరికొంత మంది అభిమానులు హోటల్ వద్ద కూడా వెల్కమ్ పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు నెట్టింట పలు వీడియోలు, పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల అమృత్‌సర్‌లో భారీ షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన తర్వాత, తాజా షెడ్యూల్‌ను ప్రారంభించాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు. మే 5న వైజాగ్‌లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌ని కిక్‌స్టార్ట్ చేయడానికి RC 15 బృందం సిద్ధంగా ఉంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ (Kiara Advani), తదితర యాక్టర్స్ పాల్గొననున్నారు. చక్కటి సందేశం, మాస్ ఎలిమెంట్స్ కలిపి శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తాజాగా మరో షెడ్యూల్ కు రెడీ అయ్యింది.