
తెలుగు సినీ హీరోల అభిమానుల అభిమానం స్థాయి కట్టలు తెంచుకుంటోంది. ఓ మెగా హీరో సినిమా టికెట్ దక్కలేదని ఏకంగా గొంతు కోసుకుంటాడొక అభిమాని. ఇక తన హీరో కోసం వేలంవెర్రి ప్రదర్శిస్తాడొకడు. అభిమానుల పోకడలు రోజురోజుకు వినూత్నంగా మారుతున్నాయి. ఆ అబిమానం ఏం ఇస్తుందో తెలియదు కానీ.. తమ అభిమానాన్ని ప్రదర్శించినప్పుడు వచ్చే కిక్కే వేరప్పా అంటున్నారు టాలీవుడ్ హీరోల అభిమానులు. అబిమానం ఏ స్థాయిలో ఎలా రంగులు మారుతోందో మీరే చూడండి.
కేవలం మూడు టికెట్ల కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు ఓ మెగా వీరాభిమాని దాంతో ఆ థియేటర్ యాజమాన్యం షాక్ అయ్యిందట . ఈ షాకింగ్ సంఘటన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో జరిగింది . బెంగుళూరు లో ఓ థియేటర్ యాజమాన్యం మొదటి మూడు టికెట్ల ని వేలానికి పెట్టింది అయితే మెగా వీరాభిమాని ఒకరు ఏకంగా ఆ మూడు టికెట్ల ని తానే వేలం పాడాడు . అది కూడా 36 లక్షలు చెల్లించడానికి ముందుకు రావడంతో అంతా షాక్ అయ్యారు. చిరంజీవి ఛరిస్మా ఇంకా తగ్గలేదు అనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణ . మూడు టికెట్ల కు భారీ మొత్తం లో డబ్బు వచ్చింది కాబట్టి ఆ సొమ్ము ని అనాధ పిల్లల సహాయం కోసం వినియోగిస్తామని థియేటర్ యాజమాన్యం చెప్తోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమి పుత్ర శతకర్ణి’ సినిమా టికెట్ కోసం ఏకంగా లక్షా వంద రూపాయలు వెచ్చించాడు ఒక అభిమాని. హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో ఏర్పాటు చేసిన ముందస్తు షో లో సినిమా చూడటానికి ఆ అభిమాని ఈ మొత్తం వెచ్చించినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తంలో టికెట్ అసలు ధర పోనూ మిగిలిన మొత్తాన్ని బసవ తారకం ఆసుపత్రి కి విరాళంగా చెల్లించనున్నట్టుగా తెలుస్తోంది.
ఇలా వేలంలో టికెట్లు అధిక ధరలకు దక్కించుకుంటున్నా వాటిని సామాజిక సేవకు ఉపయోగిస్తామనడం సంతోషించదగ్గ అంశం. మొత్తానికి సంక్రాంతి సినిమాలు ఇటు చిరు, ఇటు బాలయ్య అభిమానుల్లో జోష్ నింపాయి.