
జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు హాజరు కాలేదు. మే 20న హైదరాబాద్ వేదికగా ఈ ఉత్సవాలు జరిగాయి. టాలీవుడ్ ప్రముఖులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. మెగా హీరో రామ్ చరణ్, అక్కినేని హీరోలు నాగ చైతన్య, సుమంత్ సైతం పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రావడం కుదరదని ప్రకటన చేశారు. అదే రోజు ఆయన బర్త్ డే కాగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని వివరణ ఇచ్చారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడాన్ని నందమూరి ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. తాత పేరు పెట్టుకొని ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ కి అవసరం తీరిపోయింది. తాతయ్య కోసం ఓ రోజు కేటాయించలేకపోయాడు. జూనియర్ స్వార్ధ పరుడు. చెప్పాలంటే నందమూరి వారసుడే కాదు. కల్తీ బ్రీడ్ అంటూ పరుష పదాలతో దాడికి దిగారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మీద భారీగా వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. టీడీపీ, నందమూరి ఫ్యాన్స్ వాట్స్ యాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పై పెద్ద ఎత్తున వ్యతిరేక సందేశాలు ప్రచారం చేస్తున్నారని సమాచారం. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహించలేకున్నారు. రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేసిన మీకు, ఆయన గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు.
ఇక బాలయ్య, నారా వర్గీయులు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ వర్గీయులు మరొకవైపు చేరి సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ ఆరోపణలతో పాటు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల రికార్డ్స్ వరకు చర్చ వెళ్ళింది. మేము కూడా బాలయ్య, టీడీపీ అభిమానులమే... అయితే జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే. ఆయన జోలికి వస్తే ఎవరైనా సహించేది లేదంటున్నారు. అదే సమయంలో బాలయ్య ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కౌంటర్లు వేస్తున్నారు.
కుట్రపూరితంగానే జూనియర్ ఎన్టీఆర్ రాకుండా బాబు, బాలయ్య ప్లాన్ చేశారనేది మరో వాదన. ఇది వారు పెట్టిన చిచ్చే అంటున్నారు. మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఆయన విదేశాల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకునే ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి ఆరోజు ఉత్సవాలు ఏర్పాటు చేస్తే జూనియర్ రాలేడు. ఆ విధంగా జూనియర్ ని టీడీపీ వర్గాలు, నందమూరి ఫ్యాన్స్ లో పలుచన చేయాలి. వారికి ఆగ్రహం కలిగేలా చేయాలని ప్రణాళిక వేశారని కొందరి వాదన. వారి ప్లాన్ పక్కా ఫలించింది. జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ పార్టీకి ఈ పరిణామం మరింత దూరం చేసిందన్న మాట వినిపిస్తోంది.
మరోవైపు జూనియర్ కి కూడా ఈ వేడుకలో పాల్గొనడం ఇష్టం లేదట. కుటుంబ సభ్యులు నిర్వహించాల్సిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు టీడీపీ పార్టీ తరపున జరపడంతో ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారట. టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ సాకులు చూపి వేడుక స్కిప్ చేశారట. కారణాలు ఏదైనా ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అన్నట్లు పరిస్థితి మారింది. కొన్నాళ్లుగా ఈ గొడవలు ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో తీవ్ర రూపం దాల్చాయి.