
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. చెన్నైలో కాసేపటి క్రితం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు చెన్నై టీనగర్ లోని తన నివాసంలో శరత్ బాబు భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. రజనీకాంత్, సుహాసిని, శరత్ కుమార్, రాధిక తదితర పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికీ నివాళి అర్పించారు. అనంతరం నివాసం నుంచి గిండి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని శ్మశానవాటికకు తరలించి, అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు.
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న శరత్ బాబు.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అనంతరం ఏప్రిల్ 20న హైదరాబ్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న శరత్ బాబు శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించిందని వైద్యులు తేల్చారు. అది మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ కు దారి తీయొచ్చని తెలిపారు . వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు. మే 22 సోమవారం ఆయన కన్నుముశారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 1951 జూలై 31న శరత్ బాబు జన్మించారు. తన 22వ ఏట 1973లోనే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాంధవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. శరత్ బాబు మొత్తంగా 250 చిత్రాలకు పైగా నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం మళ్ళీ పెళ్లి. మే 26న విడుదల కానుంది.