
బాలయ్య(Balakrishna) బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడుతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన వరుసగా రెండు సినిమాలు హిట్ కావడం విశేషం. సంక్రాంతి కానుకగా వచ్చిన `వీరసింహారెడ్డి`కి నెగటివ్ టాక్ వచ్చినా, పండగ సీజన్ కావడంతో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లని సాధించింది. ఈ చిత్రం దాదాపు రూ.150కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తంగా బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు కొట్టాడు బాలయ్య. ఆ జోష్‌తో అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన ఎన్బీకే 108 మూవీ చేస్తున్నారు. వినోదం, యాక్షన్ మేళవింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అనిల్ రావిపూడి. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. ఇందులో బాలకృష్ణకి జోడీగా కాజల్ నటిస్తుంది. అంతేకాదు శ్రీలీలా కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఆమె బాలయ్యకి కూతురిగా కనిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. అయితే బాలయ్యతో సినిమా చేసేందుకు ఇప్పుడు ఏకంగా ఎనిమిది మంది దర్శకులు క్యూలో ఉండటం విశేషం. బాలయ్య క్రేజ్‌కి, ఆయన జోష్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు. మరి ఎవరెవరు ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నారు, బాలయ్య ఇమ్మిడియెట్ గా ఎవరితో చేస్తారనేది ఓ సారి చూస్తే..
బాలకృష్ణ సినిమా చేస్తానని బోయపాటి `అఖండ` సమయంలోనే ప్రకటించారు. బాలయ్య కూడా ఆ విషయంలో సుముఖంగానే ఉన్నారు. ఆయనతోపాటు `బింబిసార` ఫేమ్ మల్లిడి వశిష్ణ కూడా బాలకృష్ణకి ఓ కథ నెరేట్ చేశాడు. మైథలాజికల్ స్టోరీ నెరేట్ చేయగా బాలయ్య తన ఆసక్తిని వెల్లడించారట. సినిమా చేస్తానని కూడా చెప్పినట్టు సమాచారం. వీరితోపాటు `అన్‌స్టాపబుల్` షో టైమ్‌లో ప్రశాంత్ వర్మ ఓ కథ నెరేట్ చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన స్టోరీ కావడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని దర్శకుడికి బాలయ్య చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఆ పనిలో ఉన్నారు. ఇప్పుడాయన `హనుమాన్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
వీరితోపాటు క్రిష్‌తోనూ ఓ సినిమా చేస్తాననే కమిట్ మెంట్ ఇచ్చాడట ఎన్బీకే. మరోవైపు పూరీజగన్నాథ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. తనకు `పైసా వసూల్`తో ఫ్లాప్ ఇచ్చాడు పూరీ. అయినా అదేం పట్టించుకోకుండా మరో స్క్రిప్ట్ రెడీ చేసుకోమని, తాను సినిమా చేస్తానని భరోసా ఇచ్చారడ బాలకృష్ణ. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. అలాగే `వీరసింహారెడ్డి` డైరెక్టర్ గోపీచంద్ మలినేని, `డిక్టేటర్` డైరెక్టర్ శ్రీవాస్, వెంకటేష్ మహా వంటి దర్శకులకు బాలయ్య కమిట్‌మెంట్ ఇచ్చినట్టు చర్చ నడుస్తుంది.
ఇదిలా ఉంటే బాలయ్య ఇమ్మిడియెట్‌గా చేయబోయేది మాత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అని తెలుస్తుంది. `అఖండ`కి సీక్వెల్‌గా కాకుండా ఓ పొలిటికల్ స్టోరీగా NBK109 చేయబోతున్నారట. సెటైరికల్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం బోయపాటి.. రామ్‌తో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే బోయపాటి డైరెక్షన్‌లో సినిమాని పట్టాలెక్కించబోతున్నారట. జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేయడమో, లేక ప్రారంభించడమో చేస్తారని టాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ, మల్లిడి వశిష్టలతో సినిమాలు ఉండే ఛాన్స్ ఉందట.