
పనామా పేపర్ లీక్ కేసులో (Panama Papers leak case) బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కష్టాలు మరింతగా పెరిగాయి. ఈ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కి (Aishwarya Ra) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఐశ్వర్య రాయ్ నేడు ఢిల్లీలో.. ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం నేడు ఐశ్వర్యరాయ్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కావడం లేదు. విచారణకు హాజరు కావడానికి మరో తేదీని ఐశ్వర్య రాయ్ కోరారు.
2016లో యూకేలో పనామా బేస్డ్ లా సంస్థకు చెందిన 11.5 కోట్ల ట్యాక్స్ డాక్యుమెంట్లు లీకయ్యాయి. పనామా పత్రాల జాబితాలో పేర్లు ఉన్న వ్యక్తులు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు, వ్యాపారులు, ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. భారత్‌లోని దాదాపు 500 మంది పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. పనామా పేపర్ లీక్ కేసులో బచ్చన్ కుటుంబం పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కింద కేసును నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోని హెచ్‌ఐయూ ఈ అంశంపై దర్యాప్తు చేస్తోంది.