మలయాళం యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ - వెంకీ అట్లూరి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను తాజాగా అనౌన్స్ చేశారు. టైటిల్ తో పాటు ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
మలయాళం యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరిగా డైరెక్ట్ గా తెలుగు మూవీ ‘సీతారామం’లో నటించిన విషయం తెలిసిందే. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో మరింతగా క్రేజ్ పొందారు. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులోనూ మరో సినిమా చేసేందుకు దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇప్పటికే దుల్కర్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్ గా మారిపోయారు. ‘సార్’ చిత్రంతో మంచి సందేశాత్మక సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దుల్కర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar)గా టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్(వాతి)ని కూడా వారే నిర్మించడం విశేషం. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి మరో విభిన్న కథాంశంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాగే విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ఈ చిత్రం ద్వారా సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడిగా ఆయన ఖ్యాతి పొందారు. ఇక ప్రస్తుతం 'నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. మనీ చుట్టూ కథ తిరుగుతుందని టైటిల్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.
జాతీయ అవార్డు గ్రహీత, సార్(వాతి)కి చార్ట్‌బస్టర్ సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Presenting to you - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬 pic.twitter.com/NwNaZ9NAwC
— Dulquer Salmaan (@dulQuer)