
నాలుగేండ్ల పాటు దర్శకధీరుడు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం కోసం అటు ప్రేక్షకులే కాకుండా స్టార్ కాస్ట్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర తారాగనం కూడా ఎదురు చూసింది. ప్రేక్షకులతోనే మీరూ సినిమా చూడాలని జక్కన్న కండీషన్ పెట్టడంతో ఎన్టీఆర్, చరణ్ చేసేదేమీ లేక దానికే కట్టుబడి ఉన్నారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ బిగ్ మల్టీస్టారర్ మూవీ బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.
రిలీజ్ కు ముందు రోజు నుంచే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు థియేటర్లు కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. అయితే తమ అభిమాన హీరోలు దాదాపు మూడేండ్ల తర్వాత వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ తొలిరోజే ‘ఆర్ఆర్ఆర్’ను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఇటు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి కూడా అభిమానులతో కలిసి థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో తన ఫ్యామిలీతో కలిసి సినిమాను చూశారు. ఫ్యాన్స్ తో కలిసి, కుటుంబ సమేతంగా ఆర్ఆర్ఆర్ చూడటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే థియేటర్ నుంచి బయటికి వస్తూ.. రెండు చేతులతో సూపర్ అంటూ ఫ్యాన్స్ కు సంజ్ఞ చేశాడు. సూపర్ హిట్, మాటల్లేవు అంటూ తను ఇచ్చిన రియాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన మూవీపై ఇచ్చిన రియాక్షన్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలాగే ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్ ఇద్దరూ భ్రమరాంబ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు. అయితే ఈ థియేటర్ వద్ద రాజమౌళి, చెర్రీ ఫ్యాన్స్ నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు నుంచి థియేటర్ హాల్ కు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. థియేటర్ వద్ద రామ్ చరణ్ కనిపించడంతో చెర్రీ ఫ్యాన్స్ ఒకేసారి ఆయన వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ సెక్యూరిటీ వారిని అడ్డుకుని సెఫ్టీగా థియేటర్ లోకి తీసుకెళ్లారు. ఈ హడావుడిలో రామ్ చరణ్ షూ కూడా ఊడిపోయింది. అయినా చరణ్ తన ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సినిమా సూపర్ హిట్ అని తెలిపారు.