కెజిఎఫ్ దర్శకుడికి వస్త్రాపహరణం... కానీ పరువుపోయింది ఎవరిది?

Published : Mar 07, 2023, 01:41 PM ISTUpdated : Mar 07, 2023, 01:45 PM IST
కెజిఎఫ్ దర్శకుడికి వస్త్రాపహరణం... కానీ పరువుపోయింది ఎవరిది?

సారాంశం

 కెజిఎఫ్ 2 చిత్రాన్ని కించపరిచేలా దర్శకుడు వెంకటేష్ మహ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. అది కన్నడ పరిశ్రమకు చెందిన చిత్రం అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే ఎక్కువగా ఈ సంఘటనను ఖండిస్తున్నారు.   

నలుగురు మేధావి డైరెక్టర్స్ ని మరో మేధావి యాంకర్ చర్చకు పిలిచారు. సినిమా కంటెంట్, ఆడియన్స్ టేస్ట్, ఓటీటీ, థియేటర్స్ ఇలా సమకాలీన సినిమా పరిస్థితుల మీద పలు విషయాలు తెరపైకి తెచ్చారు. ఆ మేధావి డైరెక్టర్స్ వర్గంలో ఒకరైన వెంకటేష్ మహ కెజిఎఫ్ 2 ఒక చెత్త చిత్రం, హీరో ఒక నీచ్ కమీన్ కుత్తే... మేము తలచుకుంటే ఇలాంటివి బొచ్చెడు తీస్తాము. తలుచుకోవడం లేదంతే అన్నారు. తనని తాను కే విశ్వనాథ్ కి మించిన సెన్సిబుల్ డైరెక్టర్ గా ధృవీకరించుకున్నాడు. ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఛండాలమైన భాషల్లో కెజిఎఫ్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఎగతాళి చేస్తుంటే... పక్కన ఉన్న డైరెక్టర్స్, యాంకర్ పకపకా నవ్వారు. 

ఒక విధంగా చెప్పాలంటే కెజిఎఫ్ సినిమాకు,  ఆ చిత్ర దర్శకుడికి వస్త్రాపహరణం చేశారు. మయ సభలో ద్రౌపది సంఘటన గుర్తొచ్చింది. వాళ్లలోని  మరో డైరెక్టర్ నేను స్త్రీలను ఉద్దరించడానికి బ్రోచేవారెవరురా మూవీ చేస్తే... ఈ జనాలు దాన్ని కామెడీ సినిమా అన్నారండి, అన్నాడు. 80 శాతం కామెడీ సన్నివేశాలతో తీసిన సినిమాను కామెడీ మూవీ అనకుండా సోషల్ మెసేజ్ మూవీ అంటారా?. ఆ లెక్కన సమరసింహారెడ్డి కూడా సందేశాత్మక చిత్రమే, లాస్ట్ లో నరకుడు వద్దు అని హీరో చెప్పాడు కాబట్టి. అంటే ప్రేక్షకులకు సినిమా చూడటం కూడా రాదని ఈ మేధావి వర్గం తేల్చేశారు. 

అసలు జనాల కోసం వీళ్ళు సినిమాలు తీస్తున్నారా లేక వీళ్ళ సినిమాల కోసం జనాలు మారాలా?. సినిమా ఇలానే తీయాలనే నియమం ఏమీ లేదు. సినిమాలో మంచి చెడు అన్నీ చెప్పాలి. కానీ సినిమా ప్రధాన లక్ష్యం వినోదం. అది ఉందా లేదా అన్నదే ప్రేక్షకుడికి ముఖ్యం. సందేశాలు, సలహాలు, పాఠాలు చెప్పడానికి బడులు, గుడులు ఉన్నాయి. మంచోళ్ళు అవ్వడానికి సినిమా థియేటర్స్ కి రావాల్సిన అవసరం లేదు. మితిమీరిన కంటెంట్ తో సినిమాలు తీస్తే కంట్రోల్ చేయడానికి సెన్సార్ బోర్డు ఉంది. 

వెంకటేష్ మహ క్షమాపణ చెబుతూ కూడా తన అభిప్రాయానికే కట్టుబడ్డాను, అన్నారు. నేను సినిమా క్యారెక్టర్ ని దూషించా కానీ వ్యక్తిని కాదన్నారు. సినిమా హీరో దర్శకుడి మానస పుత్రుడు అవుతాడు. సినిమా క్యారెక్టర్ ని తిడితే దర్శకుడిని తిట్టినట్లే లెక్క. దర్శకుడు ఆలోచనే ఒక పాత్ర అయినప్పుడు నేరుగా ఆయన్ని విమర్శించనట్లే అవుతుంది. 'ముసలి వెధకు ప్రేమేంటి? లేచిపోయి పెళ్లి చేసుకోవడమేంటి?' అని ఎవరైనా కేరాఫ్ కంచరపాలెం క్యారెక్టర్ ని తిడితే... దానర్థం వెంకటేష్ మహని తిట్టినట్లు అవుతుంది కానీ, ఆ పాత్ర చేసిన వాళ్ళనో, కల్పిత పాత్రనో దూషించినట్లు కాదు. 

గొప్ప గొప్ప క్లాసిక్ డైరెక్టర్స్ కూడా కమర్షియల్ చిత్రాన్ని తిట్టలేదు. అయితే తమ సినిమాల్లోని సన్నివేశాల ద్వారా సున్నితమైన విమర్శ చేశారు. కె విశ్వనాథ్ సాగర సంగమం మూవీలో 'వే వేల గోపెమ్మల మువ్వా గోపాలుడే' సాంగ్ ద్వారా కమర్షియల్ హీరోల మూవీ సాంగ్స్ పై ఆయన సెటైర్ వేశారు. కాబట్టి సద్విమర్శ ఆమోదయోగ్యమే. వాడే భాషా, చెప్పాలనుకున్న పాయింట్ సరిగా ఉండాలి. మనం చేయలేని పని ఇతరులు చేసి సక్సెస్ అవుతుంటే ఇలాంటి ద్వేషపూరిత కామెంట్స్ చేయడం సరికాదు. 

పరిశ్రమకు కావాల్సింది కమర్షియల్ సినిమా. అదే లేకపోతే నీ ఆర్ట్ మూవీ తీయడానికి నిర్మాత అనే వాడు ఉండడు. కెజిఎఫ్ చిత్రాన్ని తిడితే కె రాఘవేంద్రరావు నుండి రాజమౌళి వరకు అందరు కమర్షియల్ డైరెక్టర్స్ ని తిట్టినట్లే. వాళ్ళ సినిమాలో ఇంతకు మించిన లాజిక్ లేని మ్యాజిక్ లు ఎన్నో ఉన్నాయి. సినిమా చూడటం ప్రేక్షకులు నేర్పాలని చూడొద్దు, ఎలా తీయాలో మీరు నేర్చుకోండి. జనాలు శంకరాభరణం చూస్తారు సమరసింహారెడ్డి చూస్తారు. వాళ్లకు నచ్చాలి అంతే. 

ఒక కన్నడ సినిమాను కించపరిస్తే తెలుగు ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. సినిమాను తెలుగు ప్రేక్షకులు అంతగా ప్రేమిస్తారు. భాషా బేధం లేకుండా ఆదరిస్తారు. అలాంటి టాలీవుడ్ ఆడియన్స్ కి సినిమా చూడటం రాదని నిర్ధారించి ఈ గొప్ప డైరెక్టర్స్ భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఏంటో చూడాలి...  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా