
కొన్ని నెలల క్రితం నటుడు రానా దగ్గుబాటి సైతం ఇండిగో సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి భార్యతో కలిసి బెంగళూరు వెళ్లిన రానాను ఇండిగో ఇబ్బంది పెట్టింది. రానా టికెట్లు బుక్ చేసుకున్న ఇండిగో విమానం రద్దయ్యింది. దీంతో మరో విమానంలో రానా ఫ్యామిలీకి సీట్లు కేటాయించారు. అయితే, ఆ విమానంలో రానా లగేజ్ రాలేదు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని రానా వ్యక్తపరిచారు. ఇప్పుడు మంచు లక్ష్మి కు దాదాపు అలాంటి పరిస్దితి ఎదురైంది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై (IndiGo) సినీ నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో వచ్చిన లక్ష్మి.. తాను
ప్రయాణించిన సమయం కంటే తనకు ఎయిర్ పోర్టులో సహాయం చేయడానికి ఇండిగో సిబ్బంది తీసుకున్న సమయమే ఎక్కువ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ ను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు.
“నా పర్స్ మర్చిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను. మీపట్ల మంచిగా ఉంటే పని కాదు. మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా ? ” అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది మంచు లక్ష్మి. అయితే ఇందులో ఇండిగో ట్విట్టర్ అకౌంట్ కాకుండా.. మరో అకౌంట్ ట్యాగ్ చేశారు.
మరో ట్వీట్లో ఇండిగో ఎయిర్ లైన్స్ ను కరెక్ట్ గా ట్యాగ్ చేస్తూ.. “ఇండిగో సిబ్బంది ఎయిర్ పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కన్నా.. త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. కానీ వాళ్లు క్షణాల్లో కనుమరుగైపోయారు. 103 డిగ్రీల జ్వరంలో కూడా ఎలాంటి సాయం చేయలేదు. ఇండిగో..దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా ? ” అంటూ పేర్కొన్నారు. మంచు లక్ష్మి చేసిన ట్వీట్స్ పై ఇండిగో సంస్థ స్పందించింది.
‘హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మా మేనేజర్ తో మాట్లాడినందుకు ధన్యవాదాలు మేడమ్. విమానంలో మీరు మర్చిపోయిన బ్యాగ్ ను తిరిగి మీకు మా సిబ్బంది అందచేశారని తెలుసుకున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. మరోసారి మా విమానంలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం. మీకు భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి అభ్యంతరం లేకుండా మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి’ అంటూ వివరణ ఇచ్చింది ఇండిగో.. అయితే ఇండిగో సంస్థ వివరణకు మంచు లక్ష్మి స్పందిస్తూ.. బ్యాన్ ఇండిగో అంటూ హ్యాగ్ ట్యాగ్ జతచేసింది.