
దర్శకుడు తేజ బోల్డ్ నెస్‌కి కేరాఫ్. ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఏదీ దాచుకోరు. ఏమనిపిస్తే అది మాట్లాడుతారు. కొన్ని సార్లు ఆయన వ్యాఖ్యలు వివాదాలుగానూ మారుతుంటాయి. కానీ వాటిని లెక్క చేయరు. పట్టించుకోరు. తాజాగా ఆయన `అహింస` అనే చిత్రాన్ని రూపొందించారు. రానా తమ్ముడు, నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా నటించారు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుసగా తేజ మీడియాతో ముచ్చటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకుడు రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
తేజ సినిమాలు అన్నీ ఒకేలా ఉంటాయనే కామెంట్ వినిపిస్తుంటుంది. మ్యూజిక్‌గానీ, కథలు ట్రావెలింగ్‌గానీ ఓ సెపరేట్ ఫ్లో ఉంటుందని అంటుంటారు. ఇదే ప్రశ్న తేజని ప్రశ్నించాడు యాంకర్. `అహింస` చిత్రం కూడా `జయం` తరహాలో కనిపిస్తుందని అడిగారు. దీనికి దర్శకుడు తేజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్ ఉంటాయని, కొన్ని సన్నీ వేశాలు కలుస్తుంటాయని,దగ్గరగా అనిపిస్తుంటాయని తెలిపారు. ఎందుకంటే ఆ సినిమాని రాసింది, తీసింది తానే అని, ఇప్పుడు తీసింది తానే అని, అందుకే దగ్గరిపోలికలుంటాయని వెల్లడించారు.
తాను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్ సినిమాలైనా ఒకేలా ఉంటాయని, అలాగే రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయని తెలిపారు. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే ప్యాట్రన్‌లో ఉంటాయని తెలిపారు. వరుస బెట్టి ఒకదాని తర్వాత ఒకటి చూస్తే ఒకేలా అనిపిస్తాయని, పెద్దగా తేడా కనిపించదని తెలిపారు. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్, గౌతమ్ మీనన్ సినిమాలు కూడా అలానే ఉంటాయని తెలిపారు తేజ.
ఇక ఇంటలిజెంట్స్ డైరెక్టర్స్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ అనే విషయం గురించి చెబుతూ, ఇంటిలిజెంట్ డైరెక్టర్స్ లో తేజ, సుకుమార్, రాజమౌళి, బోయపాటి, వినాయక్ వంటి పేర్లని యాంకర్ చెప్పగా, వాళ్లంతా ఇంటలిజెంట్ డైరెక్టర్సా అని ప్రశ్నించాడు. వాళ్లు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ మాత్రమే అని, ఇంటిలిజెంట్ డైరెక్టర్స్ కాదన్నారు. అందులో తనని కూడా కలుపుకుని, తాను ఇంటిలిజెంట్ డైరెక్టర్ ని అయితే అన్నీ హిట్లే ఇవ్వాలి కదా, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయని, ఒకవేళ తాను వేస్ట్ డైరెక్టర్‌ని అయితే అన్నీ ఫ్లాప్‌లే తీయాలి కదా, సక్సెస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇక్కడ ఇంటిలిజెంట్ అనేది కాదు, అన్నింటిని దాటుకుని ఓ మ్యాజిక్ జరుగుతుందని, అలా సక్సెస్‌లు వస్తాయని తెలిపారు.
ఇక తాను రూపొందించిన `అహింస` చిత్రం గురించి చెబుతూ, హీరో గాంధీ చెప్పిన అహింస మార్గాన్ని నమ్ముతాడు, హీరోయిన్ హింసా మార్గాన్ని నమ్ముతుంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమతో కూడిన సంఘర్షణే ఈ చిత్రమని తెలిపారు దర్శకుడు తేజ. అభిరామ్ సరసన గీతిక తివారీ హీరోయిన్‌గా నటిస్తుంది. సదా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. జూన్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.