సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) మరణంతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
రజనీ మాట్లాడుతూ.. ‘శరత్ బాబుతో ఎన్నో ఏళ్ల నుంచి నాకు అనుబంధం ఉంది. ఆయన నాకు నటుడు కాకముందే బాగా పరిచయం. మంచి వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే వారు. నేనెప్పుడూ ఆయన ముఖంలో కోపం చూడలేదు. విభిన్న పాత్రలు పోషించారు. మేమిద్దరమూ పలు చిత్రాల్లో నటించడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నన్ను బాగా ఇష్టపడేవారు. ముఖ్యంగా శరత్ బాబు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. ఓ సందర్భంలో నేను సిగరెట్ కాల్చడం చూసి.. మానేయమంటూ మందలించాడు. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నా’ అంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.
శరత్ బాబు మృతికి పలువురు సంతాపాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం గిండిలో శరత్ బాబు అంత్యక్రియలు పూర్తికానున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకూ వెళ్లారు. అక్కడా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. ఏప్రిల్ 20న హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 1951 జూలై 31న శరత్ బాబు జన్మించారు. తన 22వ ఏట 1973లోనే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాంధవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించిచారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. శరత్ బాబు మొత్తంగా 200 చిత్రాలకు పైగా నటించారు.