వివాదం: వైఎస్సార్, బాబులపై గౌరవంతో న్యాయపోరాటం చేస్తా.. డైరెక్టర్‌

By Satish ReddyFirst Published Aug 11, 2020, 3:21 PM IST
Highlights
నేడు టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. రాజకీయంగా గొప్ప నేతలుగా ఉన్న వైయస్సార్, చంద్రబాబుల స్నేహంపై ఓ సిరీస్ తెరకెక్కించనున్నట్లు ప్రకటన రావడం జరిగింది. ఐతే ఈ ప్రాజెక్ట్ పై  ప్రస్థానం దర్శకుడు దేవా కట్టా అభ్యంతరం తెలిపారు. 
రాజకీయంగా సమకాలీకులుగా ఉన్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు దేశం మెచ్చిన నేతలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన ఈ రాయలసీమ నేతలు కాంగ్రెస్ పార్టీలో తమ ప్రస్థానం మొదలుపెట్టారు. చంద్రబాబు రాజకీయాలకు పునాది పడింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే కావడం విశేషం. అప్పట్లో వైయస్సార్ చొరవతో కాంగ్రెస్ ప్రభుతంలో క్యాబినెట్ మినిస్టర్ కూడా బాబు చేశారు. తరువాత బాబు టీడీపిలోకి వెళ్లడం, ఎన్టీఆర్ కి అల్లుడు, సీఎం  కావడం చకచకా జరిగిపోయాయి. పార్టీలు మారడంతో వీరిద్దరి మధ్య సిద్ధాంతాలు, ఆలోచన విధానాలు మారిపోయాయి. ఒకప్పటి మిత్రులు రాజకీయంగా శత్రువులు అయ్యారు. వీరి కథలో స్నేహం అనే ఎమోషన్స్ తో పాటు, ఒకరంటే మరొకరు తీవ్రంగా వ్యతిరేకించుకునే వైరం కూడా ఉంది. అందుకే ఈ కథను తెరపైకి తేవడానికి రంగం సిద్ధం అయ్యింది. 
 
దర్శకుడు రాజ్ వీరిద్దరి స్నేహం మరియు వైరంపై ఓ సిరీస్ తీస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత విష్ణు ఇందుకూరి, మరో నిర్మాత తిరుమల రెడ్డితో కలిసి ఈ సిరీస్ తెరకెక్కించనున్నారు. ఈ సిరీస్ రెండు భాగాలుగా రానుంది. ఈ ఇద్దరు నేతల రాజకీయ అరంగేట్రం నుండి, స్నేహం మరియు వైరం వంటి అనేక విషయాల సమాహారంగా ఈ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం. ఐతే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటన టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్టా కోపానికి కారణం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ని ఉద్దేశిస్తూ దేవా కట్టా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
 
దేవా కట్టా మాట్లాడుతూ 2017లో వైయస్సార్, చంద్రబాబుల మధ్య స్నేహం, ఆ తరువాత ఏర్పడిన రాజకీయ వైరం అనే నేపథ్యంలో కల్పిత పాత్రలతో ఆయన కథ రాసుకోవడంతో పాటు, దానిని కాపీ రైట్స్ చట్టం క్రింద రిజిస్టర్ చేయించారట. అలాగే అప్పటి నుండి అదే కథకు కొన్ని వర్షన్స్ రాసి వాటిని కూడా రిజిస్టర్ చేయడం జరిగిందట. ఈ నేపథ్యంలో ఇదే కాన్సెప్ట్ తో మూవీ ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈ చిత్ర యూనిట్ లోని ఓ వ్యక్తి తన వద్ద ఓ స్క్రిప్ట్ కాజేసి మూవీ తెరకెక్కించారు అన్నారు. తాను రాసుకున్న కథలోని సీన్స్ లేదా థీమ్స్ అనుకరిస్తూ మూవీ తెరకెక్కిన పక్షంలో తాను చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. వైయస్సార్, బాబులపై ఉన్న గౌరవంతోనైనా ఆ పని చేస్తానని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి కట్టా వ్యాఖ్యలపై సదరు దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 
 
click me!