Latest Videos

అల్లు ఫ్యామిలీని పవన్ ఎందుకు దూరం పెట్టాడు? మెగా ఫ్యామిలీ నుంచి ‘అల్లు’ విడిపోయినట్లేనా? : ఎడిటర్స్ కామెంట్

By Venugopal Bollampalli - EditorFirst Published Jun 14, 2024, 8:29 AM IST
Highlights

ఎక్కువ మంది అల్లు ఫ్యామిలీనే జనసేనకు దూరం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. కాని వాస్తవం వేరుగా ఉండొచ్చు. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ రోజులు అంటే 2009కి వెళ్దాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు నుంచి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాకా అన్నింటా అల్లు ఫ్యామిలీ ముందుంది. అల్లు అరవింద్ ప్రతి విషయంలోనూ కీలక పాత్ర పోషించారు. కానీ ఇఫ్పుడు జనసేనలో వారి ఉనికే లేదు.

పవన్ అల్లు ఫ్యామిలీని దూరం పెట్టాడా.. లేక అల్లు ఫ్యామిలీనే జనసేనకు దూరం జరిగిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ ఇది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ చర్చకు దారి తీశాయి. అల్లు అర్జున్ YSRCP అభ్యర్థి ఇంటి కెళ్లి మద్దతివ్వడం, దీనిపై నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే. మరోవైపు సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ను ట్విటర్ లో అన్ ఫాలో కొట్టారు. ఇవన్నీ చూస్తోంటే ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి.

ఎక్కువ మంది అల్లు ఫ్యామిలీనే జనసేనకు దూరం జరిగిందని అంటున్నారు.. కాని వాస్తవం వేరుగా ఉండొచ్చు. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ రోజులు అంటే 2009కి వెళ్దాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు నుంచి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాకా అన్నింటా అల్లు ఫ్యామిలీ ముందుంది. అల్లు అరవింద్ ప్రతి విషయంలోనూ కీలక పాత్ర పోషించారు. కానీ ఇఫ్పుడు జనసేనలో వారి ఉనికే లేదు. ఇందుకు రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్న ఓ కారణం ఏంటంటే.. ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థుల ఎంపికలో అల్లు ఫ్యామిలీ బాగా డబ్బు ఖర్చు పెట్టగలిగిన వారికే ప్రాధాన్యం ఇచ్చిందని.. అందువల్లే ప్రజారాజ్యం కేవలం 18 సీట్లకే పరిమితమైందని చెబుతుంటారు. 

కానీ పవన్ కల్యాణ్ ఈ తప్పు చేయనీయడు.. తన పార్టీలో తనే అల్టిమేట్. తనకు ప్రత్యామ్నాయంగా మరో పవర్ సెంటర్‌ను ఏ నాయకుడూ ఇష్టపడడు. పైగా ప్రజా రాజ్యం పార్టీ ఘోర ఓటమికి అల్లు ఫ్యామిలీ కూడా ఓ కారణం అన్న ప్రచారమూ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణనే అల్లు ఫ్యామిలీకి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని అనినిస్తోంది. 

మరోవైపు ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు. అసలు ఆహ్వానం అందిందో? లేదో? కూడా తెలియదు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద పండుగ లాంటిది. పవన్ తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను గెలిచి 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించాడు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ప్రధాని మోదీ కూడా పవన్‌పై అంతులేని అభిమానాన్ని చూపించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి ఇద్దరితో కలిసి మోదీ ప్రజలకు అభివాదం చేసిన సీన్ చూస్తే ఏపీలో బీజేపీకి పవన్ కల్యాణే ప్రధానం అనిపిస్తోంది. 

వ్యక్తిగత పరిచయం వల్ల అల్లు అర్జున్ వైసీపీ నాయకుడి ప్రచారానికి మద్దతుగా వెళ్లాడు. అది వ్యక్తిగతమనీ చెప్పుకున్నాడు. అందులో రాజకీయం లేదన్నాడు. అల్లు అర్జున్ రాజకీయాలకు చాలా దూరం. కానీ మెగా కంపౌండ్  మాత్రం పవన్ కల్యాణ్‌కు జై కొట్టాల్సిందే అంటుంది. మరోవైపు చాన్నాళ్ల క్రితమే పవన్ ఫ్యాన్స్‌కూ బన్నీకి నడుమ దూరం పెరిగింది. సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రతి దాడులు కూడా చూశాం. 

అల్లు అర్జున్ ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లడంపై నాగబాబు పెద్ద రచ్చ చేశాడు. తరువాత వెనక్కి తగ్గాడు. ముందే చెప్పినట్లు అల్లు అరవింద్‌కి మొదటి నుంచీ పవన్ కల్యాణ్‌తో సరైన సంబంధాలు లేవు. ఇప్పుడు బన్నీ ఇష్యూతో ఆ దూరం మరింత పెరిగింది. చిరంజీవి మొహం అత్యంత ఆనందంతో వెలిగిపోతుంటే, బావమరిది అల్లు అరవింద్ మాత్రం దూరదూరంగానే ఉంటున్నాడు. మొత్తానికి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అంటే అటు కొణిదెల.. ఇటు అల్లు ఫ్యామిలీలను కలిపి చెప్పేవారు. ఇకపై కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వేరు కానుంది.

click me!