
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దాసరి మద్దతు కోసం తపించిన పవన్.. దాసరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. బుధవారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించిన పవన్.. ఆపై జనసేన తరుపున ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
'దాసరి నారాయణరావు ఓ దార్శనికుడని, ఓ చైతన్యమూర్తి' అని ఈ సందర్భంగా పవన్ కొనియాడారు. ఆయన మరణం తెలుగు జాతి మొత్తానికి తీరని లోటు అని, వ్యక్తిగతంతా తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాయే శ్వాసగా జీవించిన దాసరి.. సినిమాల్లో స్పృశించని అంశం లేదన్నారు.
దాసరి స్వయంకృషితో కష్టపడి కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారని పవన్ గుర్తుచేశారు. దాసరి చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. దాసరి కష్టించే తత్త్వం అంటే తనకు ఇష్టమని, తన కుటుంబానికి ఆయనతో ఎనలేని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. చివరగా, దాసరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఆయన ఆత్మ శాంతించాలని పవన్ పేర్కొన్నారు.