
విశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదు. అది అనర్థాలకు అవమానాలకు దారితీయవచ్చు. దసరా మూవీ విషయంలో నాని ప్రదర్శిస్తుంది అతి విశ్వాసమే అని టాలీవుడ్ టాక్. ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ అయినప్పటి నుండి నాని అసలు తగ్గేదేలే అనే యాటిట్యూడ్ మైంటైన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలలో హీరోలను, పరిశ్రమను టార్గెట్ చేస్తూ కొన్ని పరోక్ష కామెంట్స్ చేశారు.
పేరుకు ముందు స్టార్ ట్యాగ్ ఇష్టపడను అన్నారు. ఒకవేళ ఇష్టం లేకపోతే తీసేస్తే పోయే. మిగతా హీరోల ఇష్టాలను ఇండైరెక్ట్ గా ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏముంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఆయన పలు అభ్యంతరకర కామెంట్స్ చేశారు. మిగతా హీరోలను మీ జుట్టు ఒరిజినలేనా అని అడగొద్దన్నారు. పుష్ప విడుదలయ్యే వరకు దర్శకుడు సుకుమార్ అంటే ఎవరో ఇతర పరిశ్రమల్లో తెలియదన్నారు. టాలీవుడ్లో నాలా నటించే నటులు లేరన్నారు.
అలాగే దసరా చిత్రాన్ని కెజిఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాలతో పోల్చారు. ఎందుకు బూతు డైలాగ్స్ మాట్లాడారంటే అది వాడుక భాషే అని సమర్ధించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గతంలో నాని ఎన్నడూ ఈ తరహా ప్రవర్తన చూపించలేదు. ఒకటి రెండు సందర్భాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అంతటితో అది అయిపోయింది.
దసరా మూవీ ప్రమోషన్స్ లో ఓ కొత్త నానిని పరిచయం చేశారు. ఆయన కామెంట్స్ వివాదాస్పదం అవుతాయని తెలుసు. సినిమాకు ప్రచారం దక్కుతుందని తెలిసీ అలా ప్రవర్తించారా? లేక ఆయన మనసులో ఉన్న మాటలు బయటపెట్టారా? అనేది అర్థం కావడం లేదు. ఆయన దుందుడుకు ప్రవర్తనకు కారణం ఏదైనా సినిమా ఆడితే... ఇవన్నీ జనాలు మర్చిపోతారు. ఏమాత్రం తేడా కొట్టినా ఏకిపారేయడం ఖాయం. ఇదేనా కెజిఎఫ్,ఆర్ ఆర్ ఆర్ అంటూ నానిని ట్రోల్ చేస్తారు. కాబట్టి దసరా విజయం నాని ఇజ్జత్ మేటర్.
మార్చి 30న దసరా వరల్డ్ వైడ్ విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. శ్రీకాంత్ ఓదెల చిత్ర దర్శకుడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.