
11 ఏండ్ల తర్వాత మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ మరోసారి సెట్ అవ్వడం ఫ్యాన్స్, ఆడియెన్స్ లో తెలియని జోష్ ను నింపింది. ఎస్ఎస్ఎస్ఎంబీ28 (SSMB28) వర్క్ టైటిల్ తో చిత్రం రూపొందుతోంది. ముచ్చటగా మూడోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుడటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ‘అతడు, ఖలేజా’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. మహేశ్ ను సరికొత్తగా చూపించిన దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు కావడం విశేషం.
అయితే, ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ28’పై హైప్ నెలకొంది. గతేడాది ఆగస్టు 9న ఈ కాంబినేషన్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం మహేశ్ బాబు న్యూ యార్క్ హాలీడేలో ఉన్నారు. ఆయన రెండ్రోజుల్లో ఇండియాకు తిరిగి రానున్నారు. రాగానే త్రివిక్రమ్ తో కలిసి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జూలై మొదటి వారంలోనే ప్రారంభం కానున్నట్టు గట్టిగానే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘ఎస్ఎస్ఎంబీ28’ నుంచి ఫస్ట్ లుక్ ను వదిలే ప్లాన్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ అప్డేట్ ఆగస్టు 9న రానుంది. ఆయన పుట్టిన రోజున తప్పకుండా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయనున్నారంట. అందులో భాగంగానే జూలైలోనే షూటింగ్ కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్నారు. నిర్మాతగా ఎస్.రాధాకృష్ణ(చినబాబు) వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఎంపిక అయ్యారు. కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్ , కెమెరామెన్‌గా మధీని ఎంపికయ్యారు. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.