
మెగా అభిమానులకు గూస్ బంప్స్ కలిగించే ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఓ భారీ చిత్రాల దర్శకుడుతో రామ్ చరణ్ మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెనిర్మించనున్నాడనేది మరో విశేషం. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు రామ్ చరణ్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు.
మరో స్టార్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, దర్శకుడు రాజమౌళి భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత చరణ్ ప్రాజెక్ట్ ఏమిటనేది స్పష్టత లేదు. ఆచార్య సినిమాలో ఓ కీలక రోల్ చేస్తున్న చరణ్, అధికారికంగా మరో మూవీ ప్రకటించలేదు. మిగతా స్టార్ హీరోలందరూ రెండు నుండి మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. చరణ్ ఈ విషయంలో వెనుక బడ్డాడని ఆయన ఫ్యాన్స్ కొంచెం నిరాశలో ఉన్నారు.
అయితే వారికి చరణ్ ఓ భారీ ప్రాజెక్ట్ ని గిఫ్ట్ గా ఇవ్వనున్నాడనేది తెలుస్తుంది. దేశం మెచ్చిన దర్శకులలో ఒకరిగా ఉన్న శంకర్ రామ్ చరణ్ తో మూవీ ప్లాన్ చేశారట. శంకర్ చెప్పిన కథకు రామ్ చరణ్ పచ్చ జెండా ఊపడంతో అధికారిక ప్రకటనే మిగిలి ఉందని సమాచారం. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మించనున్నాడని తెలుస్తుంది. సౌత్ ఇండియాలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం నిలవడం ఖాయం అని చిత్ర వర్గాలు అంటున్నారు.