హీరో నితిన్ రాబోయే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయన చేరే పార్టీ, కంటెస్ట్ చేసే నియోజకవర్గం కూడా ఫిక్స్ అయ్యాయట.
హీరో నితిన్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. హిట్ మొహం చూసి చాలా కాలం అవుతుంది. కొత్త చిత్రాలు అయితే ప్రకటించాడు కానీ అవి బ్రేక్ ఇస్తాయనే నమ్మకం లేదు. ఇరవై ఏళ్లకు పైగా పరిశ్రమలో ఉన్న నితిన్ టై టు హీరోల జాబితాలో కూడా వెనకే ఉన్నాడు. ఒక్క హిట్ పడితే అరడజను ప్లాప్స్ ఇస్తాడు. అది ఆయనకు మైనస్. ఈ క్రమంలో ఆయన పాలిటిక్స్ పై ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం మొదలైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఆయన పోటీ చేస్తారట. నిజామాబాద్ కు చెందిన నితిన్ రూరల్ నియోజకవర్గం మీద కన్నేశాడట. ఆ సీటు ఆశిస్తున్నాడట. అక్కడి నుండి పోటీ చేయాలనేది నితిన్ ఆలోచనట. ఈ మేరకు రాజకీయ, సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అటు సినిమా ఇటు రాజకీయాల్లో ఏక కాలంలో రాణించాలని అనుకుంటున్నాడట.
అయితే ఇదంతా ఒట్టిదేనని ఒక వర్గం వాదన. ఆయన తన బంధువుల కోసం టికెట్ ప్రయత్నాల్లో ఉన్నాడని అంటున్నారు. నితిన్ మేనమామ నగేష్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పదేళ్లకు పైగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారట. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారట.
మేనమామ నగేష్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు నితిన్ ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రత్యక్షంగా ఆయన పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. కాగా నితిన్ దర్శకుడు వెంకీ కుడుములతో ఒక మూవీ ప్రకటించారు. ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్.