ఆస్తుల వివరాలు సమర్పించాలంటూ విశాల్ కి కోర్ట్ ఆదేశాలు!

By Sambi ReddyFirst Published Sep 10, 2022, 1:07 PM IST
Highlights

లైకా ప్రొడక్షన్స్ కి అప్పు చెల్లించాల్సిన కేసులో ఆస్తుల వివరాలు సమర్పించాలని హీరో విశాల్ ని కోర్ట్ ఆదేశించింది. దానికి మరో రెండు వారాల గడువు ఇచ్చింది. 
 


హీరో విశాల్ తమకు రూ. 21.29 కోట్లు చెల్లించాలని  లైకా ప్రొడక్షన్స్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించింది. కొన్నాళ్లుగా హియరింగ్స్ జరుగుతున్నాయి. లైకా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోర్టు విశాల్ ని కోరింది. విచారణకు హాజరైన విశాల్ ఒకేసారి రూ. 18 కోట్లు తన నిర్మాణ సంస్థ నష్టపోయినట్లు కోర్టుకు వెల్లడించారు. ఆ కారణంతో అప్పు చెల్లించలేకపోయానని వివరించారు. 

శుక్రవారం జడ్జి ఎం. సుందరం సమక్షంలో ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. షూటింగ్స్ లో బిజీగా ఉన్న విశాల్ కోర్ట్ కి హాజరుకాలేదు. ఆయన తరపు న్యాయవాది విచారణకు హాజరయ్యారు. గతంలో కోర్ట్ విశాల్ ని ఆస్తుల వివరాలు సమర్పించాలని కోరగా ఆయన తరపు న్యాయవాది మరికొంత సమయం అడిగారు. అంగీకరించిన జడ్జి.. ప్రమాణ పత్రం సమర్పించడానికి మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఈనెల 23కి వాయిదా వేశారు. దీంతో విశాల్ కి ఊరట లభించినట్లయింది. 

ప్రస్తుతం విశాల్ లాఠీ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు వినోత్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో పలుమార్లు విశాల్ గాయాల బారిన పడ్డారు. డూపు లేకుండా కఠినమైన స్టంట్స్ లో పాల్గొనడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. లాఠీ విడుదలకు సిద్ధం అవుతుంది. విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. లాఠీ తో పాటు తుప్పరివాలన్ 2, మార్క్ ఆంటోని అనే మరో రెండు చిత్రాల్లో విశాల్ నటిస్తున్నారు. 
 

click me!