
ప్రముఖ నిర్మాత, బిజినెస్ మాన్ అజయ్ కుమార్ సింగ్ వద్ద హీరోయిన్ అమీషా పటేల్ రూ. 2.5 కోట్లు ఓ ప్రాజెక్ట్ ఒప్పందంలో భాగంగా తీసుకున్నారు. ఆ సినిమా చేయకపోగా అమీషా పటేల్ ఆయనకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఒకసారి చెక్ జారీ చేసింది. అది కాస్తా బౌన్స్ కావడంతో అజయ్ కుమార్ ఆమెపై కేసు పెట్టారు. కేసు విచారంలో ఉండగా అమీషా పటేల్ వాయిదాలకు హాజరు కాలేదు. దీంతో జడ్జి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో చేసేది లేక ఏప్రిల్ నెలలో ఆమె కోర్టులో లొంగిపోయారు. విచారణ అనంతరం కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా తాజా విచారణకు పిటీషనర్ అజయ్ కుమార్ సింగ్ తరపున సాక్ష్యం చెప్పేందుకు కంపెనీ మేనేజర్ టింకు సింగ్ హాజరయ్యారు. అమీషా పటేల్ తరపు న్యాయవాది టింకు సింగ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. సాక్షిని ఎక్సమినేషన్ చేసేందుకు సమయం కావాలని కోరడమైంది. అసహనానికి గురైన జడ్జి అమీషా పటేల్ కి రూ. 500 జరిమానా విధించారు. తదుపరి విచారణ ఆగస్టు 7కి వాయిదా వేశారు.
2000లో కహోనా ప్యార్ హై మూవీతో అమీషా పటేల్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి తెచ్చారు. రెండో చిత్రం బద్రి సూపర్ హిట్ కొట్టింది. అనంతరం మహేష్ కి జంటగా నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు చిత్రాలు చేశారు. ఇవి పరాజయం పొందాయి.మంచి ఆరంభం లభించినా అమీషా పటేల్ నిలదొక్కుకోలేక పోయింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు చేస్తుంది. మోడల్ గా కొనసాగుతుంది. తరచుగా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది.