
“అంటే సుందరానికి” వంటి క్లాస్ చిత్రం తర్వాత నాని ఊరమస్ మేకోవర్ తో నటించిన సినిమా “దసరా”. సుకుమార్ వద్ద రంగస్దలం వంటి చిత్రాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం మొన్న శ్రీరామనవమి రోజు విడుదలైంది. నాని చాలా కాన్ఫిడెంట్ గా “2023 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న గొప్ప సినిమా దసరా” అని చెప్పడం ఈ సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఆ హైప్ ను అందుకోగలిగిన రీతిలోనే మొదటి రోజు ఓపినింగ్స్ అదరకొట్టింది. అలాగే నైజాం ఏరియాలో కలెక్షన్స్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.‘దసరా’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది పెద్ద దూరం కూడా కాదు.ఈ వీకెండ్ లో రీచ్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ను చూపెడుతూ వదిలిన ఓ పోస్టర్ వివాదానికి కారణమైంది.
ఇంతకీ ఆ పోస్టర్ లో విషయం ఏంటి అంటే బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అని వేశారు. సినిమా హిట్టు కొట్టారు. తెలుగులో కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు ప్రారంభమైన నాటి నుంచి హిట్స్ వస్తూనే ఉన్నాయి కానీ ఇలా ఆ సినిమాలో హీరో భాషతో పోస్టర్ వేయడం మాత్రం అంతగా బాగాలేదని అసలు మాట. బ్లాక్ బస్టర్ రా బాంచెత్ అంటే ఇది ఎవరిని అంటున్నట్టు.. ఏ హీరోని లేదా హీరోలని ఉద్దేశించి చెబుతున్నట్టు అని మీడియాలో డిస్కషన్స్ మొదలైంది. సినిమా సర్కిల్స్ లో విమర్శలు మొదలయ్యాయి. సినిమా హిట్టైందని గర్వం తలకెక్కిందని కొందరు సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ సైతం వేస్తున్నారు. బ్లాక్ బస్టర్ వరకు ఓకే కానీ రా బాంచెత్ అంటూ ఇది ఎవరికో చెబుతున్నట్టుగా పోస్టర్ పై వివాదం మొదలైంది. ఇక దసరా సినిమా వసూళ్ల లెక్కకు వస్తే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా నాని దసరా దూసుకెళ్తోంది అనేది నిజం.
ఇక ఈ చిత్రం హీరో నాని-దర్శకుడు శ్రీని కలిసి వన్ మ్యాన్ షో నడిపేలా ముందుకు వెళ్లారు. ఈ కథను, ఈ పాత్రను నాని ఎందుకు ఇంతలా నమ్మాడో.. ఎందుకు ఇంత ప్రచారం చేశాడో.. ఎందుకు పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లాడో సినిమా చూస్తే అర్థమౌతుంది. ధరణి పాత్రతో నానికి ప్రశంశలే కాదు, అవార్డులు కూడా రావడం గ్యారెంటీ. ఇక వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ చక్కగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సూరిగా దీక్షిత్ శెట్టి, సపోర్టింగ్ రోల్ లో సరిగ్గా సరిపోయాడు. ఇతర పాత్రల విషయానికొస్తే, సముద్రఖనికి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఫస్ట్ టైమ్ డైరక్టర్ లా అనిపించడు. అతడు కథ రాసుకున్న తీరు, అందులో డీటెయిలింగ్ మనల్ని మెప్పిస్తాయి.