టాలీవుడ్ లో విషాదం, సీనియర్ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

By Mahesh JujjuriFirst Published Apr 2, 2023, 9:36 AM IST
Highlights

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుల వరుస మరణాలతో  విషాదంలో మునిగిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమ.. మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. ప్రముఖ తెలుగు నటుడు కాస్ట్యూమ్స్  కృష్ణ కన్ను మూశారు.

ఈరెండేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మంది సీనియర్ నటులను కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు,  విశ్వనాథ్, జమున, కైకాల.. ఇలా ఎంతో మంది నటీనటులు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక టాలీవుడ్ లో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఈరోజు( ఏప్రిల్ 2) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని స్వగృహంలో మరణించారు. 

గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కృష్ణ. హాస్పిటలల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈమధ్యే కోలుకుని ఇంటికి వచ్చిన ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆయన స్వగృహంలోనే కన్ను మూశారు. కాస్ట్యూమర్ గా జీవితాన్ని స్టార్ట్ చేసిన ఆయన నటుడిగా, నిర్మాతగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి  సేవలందించాడు. తెలుగులో పెళ్ళి పందిరి సహా 8 సినిమాలను నిర్మించిన ఆయన.. కోడి రామకృష్ణ దర్వకత్వం వహించిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. 

తక్కువ సినిమాల్లో నటించినా.. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు కృష్ణ. కన్నింగ్ పాత్రలు, విలన్ పాత్రలు, కామెడీతో పాటు పిసినారి పాత్రలు చేయడంలో ఆయన దిట్ట. పెళ్ళాం చెపితే వినాలి, దేవుళ్ళు, దొంగ మెగుడు, అల్లరి మెగుడు, పెళ్ళి పందిరి, పుట్టింటి రా చెల్లి లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. విజయ నగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించిన ఆయన.. కాస్ట్యూమర్ గా పనిచేస్తూ.. చెన్నై చేరారు. ఎక్కువ కాలం సురేష్ ప్రొడక్షన్స్ లో కాస్ట్యూమర్ గా పనిచేశారు కృష్ణ.  అలా చెన్నైలోనే కుటుంబంతో స్థిరపడ్డాడు కాస్ట్యూమ్స్ కృష్ణ. 

ఇక ఇండస్ట్రీ హైదరాబాద్ షిప్ట్ అయిన తరువాత ఆయన సినిమాలు మానేశారు. ఆరోగ్యం సహకరించకపోవడం. సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో పాటు..పలువురు ఇండస్ట్రీవాళ్ల చేతుల్లో ఆయన మోసపోయినట్టు గతంలో ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాంతో ఇండస్ట్రీకి దూరం అయ్యానన్నారు. ఇక కాస్ట్యూమ్స్ కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం అలముకుంది. పలువురు సీనీ పెద్దలు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. 

click me!