
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కారణంగా జూన్ కి వాయిదా పడింది. అప్పుడు కూడా వస్తుందో రాదో క్లారిటీ లేదు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేశారు. టీజర్ కి ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో పోస్టర్ ని కూడా నెటిజన్లు అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ తో ఆదిపురుష్ టీం మరింత చిక్కుల్లో పడింది.
తాజాగా ముంబైలో ఆదిపురుష్ చిత్ర దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదైంది. ప్రముఖ హిందూ ప్రవచన కర్త సంజయ్ దినానాథ్ తివారి ఆదిపురుష్ చిత్రంపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు. వరుస వివాదాలు, విమర్శలతో అసలే ఆదిపురుష్ టీం పరిస్థితి మూలిగే నక్కలా మారింది. తాజాగా కేసు దానిపై తాటి పండు పడ్డట్లు ఐంది.
శ్రీరామ నవమికి రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ శ్రీరాముడి లుక్ హిందూ మనోభావాలకు విరుద్ధంగా ఉందని సంజయ్ దినానాథ్ అంటున్నారు. ఆయన నమోదు చేసిన కంప్లైంట్ ప్రకారం.. రామచరిత మానస్ లో రాముడి ఆహార్యం, స్వభావానికి విరుద్ధంగా ఆదిపురుష్ లుక్ ఉందని సంజయ్ అంటున్నారు.
హిందూ సనాతన ధర్మం రామచరిత మానస్ కి అనుగుణంగా ఉంటుంది. కారణ జన్ముడు అయిన శ్రీరాముడి కాస్ట్యూమ్స్ అభ్యంతరకరంగా సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉంది. రామచరిత మానస్ లో వర్ణించిన విధంగా అతి ముఖ్యమైన జంధ్యం లేదని ప్రవచన కర్త సంజయ్ ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, నిర్మాతలపై ఆయన సెక్షన్ 295 ఏ, 298, 500, 34 కింద కేసు నమోదు చేశారు.
ముంబై హైకోర్టు న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా సహాయంతో సంజయ్ దినానాథ్ ఈ కేసు నమోదు చేశారు. మరి దీనిపై ఆదిపురుష్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.