
టాలీవుడ్ కామెడీయన్, యూట్యూబ్ స్టార్ మహేష్ విట్టా తండ్రి కాబోతున్న శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మహేష్, తన ప్రత్యేకమైన యాసతో షార్ట్ ఫిల్మ్స్, ఫన్ బకెట్ కామెడీ వీడియోల ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్, ఇందు వదన వంటి సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేసి.. తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరించాడు.
ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3, అలాగే బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లోనూ పాల్గొన్న మహేష్ విట్టా, ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్యే తన వ్యక్తిగత జీవితంలో మధురమైన ఘట్టాన్ని పంచుకున్నాడు. మహేష్ బేబీ బంప్ తో ఉన్న తన భార్య శ్రావణి రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఈ ఫోటోలు షేర్ చేస్తూ, “మా కథలోకి మరొకరు వస్తున్నారు. త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం” అంటూ తన ఆనందాన్ని తెలిపాడు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు మహేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ విట్టా 2023 సెప్టెంబర్‌లో శ్రావణి రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరిది ప్రేమ వివాహం. శ్రావణి మరెవరో కాదు, మహేష్ చెల్లెలి స్నేహితురాలు. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు, తమ ప్రేమను ప్రతిబింబించే ఒక చిన్నారి తమ జీవితంలోకి రాబోతున్నారని చెప్పడం ద్వారా మహేష్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఈ శుభవార్తతో ఆయన అభిమానులే కాదు, ఇండస్ట్రీలోని ఎంతోమంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.