
సినిమాలు వాయిదా పడటం పెద్ద విషయమేమీ కాదు. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని సార్లు మరో విఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని ,అలాగే మరికొన్ని సార్లు బిజినెస్ పూర్తి కాక, ఓటిటి వాళ్లు అనుకున్న రేటుతో ముందుకు రాకపోవటం, థియేటర్స్ దొరక్కపోవటం వంటి రీజన్స్ కనపడుతూంటాయి. కొన్ని పైకి చెప్పుకునేవి, మరికొన్ని చెప్పుకోలేనివి. అయితే ఇప్పుడు విక్రమ్ తాజా చిత్రం తంగలాన్ వాయిదా పడింది. అందుకు కారణం మాత్రంచాలా మంది ఊహించనదే కావటం విశేషం. అదేమిటో చూద్దాం.
వాస్తవానికి చియాన్ విక్రమ్ ప్రస్తుతం చేస్తున్న తంగలాన్ చిత్రంపై అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. ఈ సినిమాలోనూ ప్రత్యేకమైన గెటప్‍లో విభిన్నమైన పాత్రను చేస్తున్నాడు విక్రమ్. స్టార్ డైరెక్టర్ పా రంజిత్.. తంగలాన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 19వ శతాబ్దం బ్యాక్‍డ్రాప్‍లో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. తంగలాన్ పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. తంగలాన్ గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేసాయి. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూవిక్రమ్ తన సైన్యంతో సమరాన్ని వెళ్తున్నట్టు ఉన్న కొత్త లుక్ గూస్‌బంప్స్ తెప్సిస్తోంది.
ఈ చిత్రాన్ని 2024 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారని తెలిసిందే. అయితే ఇప్పుడు అది జనవరి రేసు నుంచి తప్పుకుని సమ్మర్ కు వెళ్లిందని సమాచారం. 2024 వేసవిలో తంగలాన్ థియేటర్లలో సందడి చేయబోతుందని, కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తారని తెలియజేశారు మేకర్స్. అందుకు కారణం ఈ సినిమాని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపటమే అని తెలుస్తోంది. ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ సినిమాకు మంచి అప్లాజ్ వస్తుందని అప్పుడు ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతుందని, ఆ క్రమంలో రిలీజ్ చేస్తే ఓపినింగ్స్ భీబత్సంగా ఉంటాయని ,అందుకే నిర్మాత వాయిదాకు వెళ్ళారని తమిళ సినీ వర్గాల సమాచారం.
దర్శకుడు పా రంజిత్.. తంగలాన్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా పీరియాడికల్ బ్యాక్‍డ్రాప్‍లో అత్యంత భారీగా రూపొందిస్తున్నాడు. బ్రిటీష్ పాలన కాలంలో కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురొడ్డి పోరాడిన ఓ తెగ గురించి తంగలాన్ చిత్రం రూపొందుతోందని సమాచారం. విక్రమ్ తెగ నాయకుడిగా కనిపించనున్నాడు. తంగలాన్ చిత్రంలో ఇప్పటికే రివీల్ అయిన విక్రమ్ ఫస్ట్ లుక్ చాలా వైవిధ్యంగా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచింది. తంగలాన్ చిత్రం ఆస్కార్ స్థాయికి చేరుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. విక్రమ్ ఈ చిత్రంలో కోసం చాలా కష్టపడుతున్నాడు.ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.