
తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని చిరంజీవి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. `తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సి.ఎం వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం` అని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు చిరంజీవి
అంతేకాదు ఈ సందర్భంగా మీడియాకి చురకలంటించారు చిరంజీవి. ఓ రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. `రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నా` అని పేర్కొన్నారు చిరంజీవి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వత చిరంజీవి యాడ్ చేసిన యాష్ ట్యాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. `న్యూస్ ఇవ్వండి, వ్యూస్ కాదు` అంటూ ట్యాగ్ చేశారు. దీంతో ఇది దుమారం రేపుతుంది.
వ్యూస్ కోసం ఇలాంటి న్యూస్‌లు ప్రసారం చేస్తున్నారనే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. రూమర్స్ క్రియేట్ చేయోద్దని వెల్లడించారు. అయితే చిరంజీవి కామెంట్స్ కి స్పందించారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. చిరంజీవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. `న్యూస్ ఇవ్వండి, వ్యూస్ కాదు` అంటూ యాష్ ట్యాగ్ చేశారు విజయ్. దీంతో ఇప్పుడిది వైరల్ అవుతుంది. గతంలోనూ విజయ్ దేవరకొండ పలు రూమర్స్ ఎదుర్కొన్నారు. ట్రోల్స్ కి గురయ్యారు. కరోనా సాయం సమయంలో ఆయనపై అనేక రూమార్లు వైరల్ అయ్యాయి. దీంతో ఆ సమయంలోనే ఘాటు కామెంట్ చేసిన విజయ్ ఇప్పుడు మరోసారి ఈ రూపంలో పంచుకున్నారు. మొత్తంగా చిరంజీవి కామెంట్‌కి, విజయ్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఏపీలో నెలకొన్ని టికెట్ల సమస్యని పరిష్కారం దిశగా రంగంలోకి దిగారు. గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయనే విషయాన్ని వెల్లడించారు. మరో రెండు మూడు వారాల్లో సమస్యకి పరిష్కారం వస్తుందని, అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలుంటాయని చెప్పారు. అయితే త్వరలో చిరు వైసీపీ తరఫున రాజ్యసభ పదవి దక్కించుకోబోతున్నారని వార్త బయటకు వచ్చాయి. పవన్‌ని దెబ్బకొట్టేందుకు చిరుని రంగంలోకి దించారనే టాక్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి స్పందించి తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు.
ఇక సినిమాల పరంగా చిరంజీవి `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `గాడ్‌ఫాదర్`, `భోళాశంకర్`తోపాటు `మెగా154` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం `లైగర్` లో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.