
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురికి తమ తల్లి అంజనాదేవి అంటే అమితమైన ప్రేమ. సమయం దొరికినప్పుడల్లా మెగా బ్రదర్స్ ముగ్గురూ ఆమెతో ప్రేమగా గడుపుతుంటారు. నేడు మదర్స్ డే సందర్భంగా సెలెబ్రిటీలంతా తమ తల్లుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ విషెస్ చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. తల్లులందరికీ అభివందనములు.. ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అంటూ చిరంజీవి ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ తమ తల్లి అంజనా దేవితో షూటింగ్ లొకేషన్ లో భోజనం చేస్తూ.. ఆమెని కారు ఎక్కిస్తున్న అందమైన దృశ్యాలు ఉన్నాయి.
ఈ వీడియో బ్యాగ్రౌండ్ లో వకీల్ సాబ్ చిత్రంలోని పాట మ్యూజిక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ వీడియో ఎమోషనల్ గా ఉంటూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎక్కడో షూటింగ్ లొకేషన్ లోనే వీరంతా తమ తల్లితో ఉన్నారు.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పంచె కట్టులో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చివరగా నటించిన ఆచార్య చిత్రం ఇటీవల విడుదలయింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నిరాశపరిచింది. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా కీలక పాత్రలో నటించారు.
ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు చిత్రంలో నటిస్తున్నారు. మొఘల్ ఎంపైర్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.