
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం `భోళాశంకర్`(Bhola Shankar) తో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఆయన సినిమా రిలీజ్ కానుంది. ఈ నెల 22న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది. తాజాగా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా చిరంజీవి నెక్ట్స్ మూవీస్ అంటూ రెండు ప్రాజెక్ట్ ల పేర్లు వినిపించాయి. కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా, అలాగే `బింబిసార` ఫేమ్ వశిష్టతో మరో సినిమా అంటూ ప్రధానంగా చర్చ జరిగింది.
అయితే తన నెక్ట్స్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ అయ్యిందట. కళ్యాణ్ కృష్ణ(Kalyan krishna) దర్శకత్వంలోనే ఉంటుందట. అయితే ఇది రీమేక్ కావడం విశేషం. మలయాళంలో రూపొంది హిట్ అయిన `బ్రో డాడీ`(Bro Daddy) చిత్ర రీమేక్ చిరంజీవి చేస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మెగాస్టార్ దానికే ఓటేశారట. నెక్ట్స్ సినిమాగా దాన్నే తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. దీనికి `బంగార్రాజు` ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. అయితే ఇందులో మరో హీరోకి అవకాశం ఉంది. కొడుకు పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర కోసం గతంలో సిద్ధు జొన్నలగడ్డ పేరు వినిపించింది. అయితే అతను నటించేందుకు తిరస్కరించారట.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో యంగ్ హీరోని ఫైనల్ చేశారని సమాచారం. శర్వానంద్ ఓకే అయినట్టు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీతో శర్వానంద్(Sharwanand)కి మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. చిరుకి రామ్‌చరణ్ తర్వాత కొడుకులా శర్వాని భావిస్తుంటారు. అంతగా వారి మధ్య అనుబంధం ఉంది. `బ్రో డాడీ` రీమేక్‌లో కొడుకుగా శర్వా అయితే బెస్ట్ అని భావించారట. చిరుతో సినిమా అనగానే ఆయన కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు. చిరంజీవి నెక్ట్స్ మూవీ ఇదే ఉండబోతుందట. ఆయన బర్త్ డేకి ఈ సినిమాని ప్రారంభిస్తారని సమాచారం.
ఇక ఈ సినిమాకి హీరోయిన్లు కూడా ఫైనల్ అయ్యారట. ఇద్దరు క్రేజీ బ్యూటీస్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. కొడుకు పాత్రకి శ్రీలీల(Sreeleela) పేరు చాలా రోజులుగా వినిపిస్తుంది. ఇక చిరుకి జోడీ ఎవరనేదే ప్రశ్న. ఆయనకు త్రిష(Trisha) జోడీ కడుతుందట. `స్టాలిన్` సినిమా తర్వాత మరోసారి చిరుతో త్రిష స్టెప్పులేయబోతుండటం విశేషం. అయితే `ఆచార్య` చిత్రానికి కూడా త్రిష ఓకే చెప్పింది. కానీ అనూహ్యంగా ఆమె తప్పుకుంది. ఇప్పుడు ఈ రీమేక్‌కి ఓకే చెప్పడం విశేషం. ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న `బ్రో డాడీ` ఎలా ఉండబోతుందో చూడాలి.
చిరు వరుసగా రీమేక్‌లే చేస్తున్నారు. రీఎంట్రీ తర్వాత `ఖైదీ నెంబర్ 150` రీమేకే. `గాడ్ ఫాదర్` రీమేకే, ఇప్పుడు చేస్తున్న `భోళాశంకర్` రీమేక్ చిత్రమే. మరోవైపు కొత్త మూవీ కూడా రీమేక్ కావడం గమనార్హం. గతంలోనూ చిరంజీవి రీమేక్ సినిమాలు చేశారు. అవే ఎక్కువ విజయాలు సాధించాయి, ఆయనకు స్టార్ ఇమేజ్‌ని తీసుకొచ్చాయి. దీంతో సరిగ్గా రీమేక్‌లు చేస్తే హిట్ గ్యారంటీ అనేది ఆయన నమ్మకం. మరి ఆగస్ట్ 11న విడుదల కానున్న `భోళా శంకర్` ఎలాంటి రిజల్ట్ నిస్తుందో చూడాలి. ఇది తమిళంలో హిట్ అయిన `వేదాళం` చిత్రానికీ రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, తమన్నా హీరోయిన్‌గా నటించింది. కీర్తిసురేష్.. చిరుకి చెల్లిగా నటించడం విశేషం.