
మెగాస్టార్ చిరంజీవి.. భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారితో భేటీ అయ్యారు. తన ఇంటికి ఆహ్వానించిన ఆయన వారికి తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా రాయబారి, అధికారులతో దిగిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు చిరంజీవి. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, ఇండియా సంస్కృతులు ఒకేలా ఉంటాయని, సినిమా, వినోద రంగానికి సంబంధించిన కల్చర్ కూడా దగ్గరగా ఉంటుందని, అక్కడి కల్చర్‌ని మనవాళ్లు ప్రోత్సహిస్తున్నారని, ఇప్పుడు మన సినిమాలు కూడా అక్కడ ఆడుతున్నాయని తెలిపారు చిరంజీవి.
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఇందులో చిరంజీవి చెబుతూ, భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి గౌరవార్థం హై టీ సెషన్‌ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రాయబారి చాంగ్ జీబాక్‌ని కలవడం చాలాసంతోషం. శ్రీనగర్‌లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్‌లో రామ్‌చరణ్‌తో కలిసి `నాటు నాటు` పాటకి డాన్సులు వేసినప్పట్నుంచి మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను.
దక్షిణ కొరియా అద్భుతమైన భూమి, అక్కడి సంస్కృతి, మన సంస్కృతులు చాలా దగ్గరగా ఉంటాయి. ఆహారం, సంగీతం, సినిమాల పట్ల మనకున్న ప్రేమ మాత్రమే కాదు, కె-పాప్, కె-డ్రామాలు ఇప్పటికే ఇండియన్ ఆడియెన్స్ లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా దక్షిణ కొరియాలోకి అడుగుపెట్టబోతుండటం చాలా ఆనందంగా ఉంది` అని పేర్కొన్నారు చిరంజీవి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్ కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా దిగిన పోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
జీ20 సదస్సులో సినిమా రంగం నుంచి రామ్ చరణ్ పాల్గొనడం అరుదైన విషయమనే చెప్పాలి. మరే నటుడికి ఇది సాధ్యం కాలేదు. రామ్‌చరణ్.. `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంతో గ్లోబల్ వైడ్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా `నాటు నాటు` పాటకి ఎన్టీఆర్‌తో కలిసి వేసిన స్టెప్పులు ఖండాంతరాలు దాటి పాపులర్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్‌తోపాటు చరణ్‌కి మంచి గుర్తింపు దక్కింది. పైగా ఇటీవల చరణ్ ఈ క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ వివిధ ప్రాంతాలకు, దేశాలకు తిరుగుతూ, ఆ క్రేజ్‌ని మరింత పెంచుకుంటున్నారు.
ఇక చిరంజీవి గతంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు రాజకీయంగా మంచి పరిచయాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ కొరియా రాయబారిని ఇంటికి ఆహ్వానించి తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు. ఇక చిరంజీవి ప్రస్తుతం `భోళాశంకర్` చిత్రంలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ రూపొందిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్ చిరుకి చెల్లిగా చేస్తుంది.