చిరు ఎఫెక్ట్: జాగ్రత్త పడిన సెలబ్రిటీలు!

By Udayavani DhuliFirst Published Dec 8, 2018, 1:00 PM IST
Highlights

నిన్న జరిగిన తెలంగాణా ఎలెక్షన్స్ లో దాదాపు అందరు సెలబ్రిటీలు క్యూలో నిల్చొనే ఓట్లు వేశారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్, ఎన్టీఆర్, రానా ఇలా అందరూ క్యూ సిస్టమ్ పాటించారు. 

నిన్న జరిగిన తెలంగాణా ఎలెక్షన్స్ లో దాదాపు అందరు సెలబ్రిటీలు క్యూలో నిల్చొనే ఓట్లు వేశారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్, ఎన్టీఆర్, రానా ఇలా అందరూ క్యూ సిస్టమ్ పాటించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఓటు వేయడానికి వస్తే అధికారులు సైతం వారిని నేరుగా పోలింగ్ బూతులోకి పంపించి ఓటు వేయించి పంపిస్తారు.

కానీ 2014లో జరిగిన ఎలెక్షన్స్ లో మెగాస్టార్ చిరంజీవికి ఈ విషయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన చిరంజీవి నేరుగా బూత్ లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో డజనుకి పైగా అక్కడ ఉన్న జనాలు చిరంజీవిని క్యూలో రమ్మని రిక్వెస్ట్ చేశారు.

దానికి అంగీకరించని చిరు లోపలకి వెళ్లే సమయంలో ఒక వ్యక్తి చిరంజీవిని ఆపి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అతడికి వార్నింగ్ ఇచ్చాడు. బాధ్యత గల పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ చిరుకి క్లాస్ పీకాడు. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. ఆ సంఘటన చాలా మంది సెలబ్రిటీల్లో భయానికి దారి తీసింది.

దీంతో ఈసారి జాగ్రత్త పడ్డ సెలబ్రిటీలు అంతా.. లైన్ లో నిల్చొని ఓటు వేశారు. కె రాఘవేంద్రరావు మాత్రమే నేరుగా వెళ్లడానికి ప్రయత్నించగా.. ఆయన్ని జనాలు అడ్డుకున్నారని, దీంతో అలిగి వెళ్లిన ఆయన ఆ తరువాత తిరిగొచ్చి ఓటు వేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లను అనుమతించకపోవడంతో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకి రాలేదు. కానీ రాఘవేంద్రరావు మాత్రం అలాంటిదేమీ జరగలేదని తాను ఓటు వేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి చిరంజీవికి జరిగిన సంఘటనతో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా జాగ్రత్త పడ్డారు.  

click me!