చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మరో స్టార్ హీరో కర్చీఫ్ వేశాడు అంటున్నారు.
2023 సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించింది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. కాగా 2025 సంక్రాంతి సీజన్ పై చిరంజీవి కన్నేశాడు అనేది టాలీవుడ్ టాక్. వసిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర 2025 జనవరి 10న విడుదల కానుందట. సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
కాగా 2025 సంక్రాంతికి రావాలని మరో సీనియర్ స్టార్ హీరో డిసైడ్ అయ్యాడట. కింగ్ నాగార్జున చిరంజీవికి పోటీగా సంక్రాంతి రేసులో నిలుస్తాడని లేటెస్ట్ టాక్. నాగార్జునకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొస్తుంది. సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు చిత్రాలు విజయాలు సాధించాయి. లేటెస్ట్ మూవీ నా సామిరంగ కూడా సంక్రాంతి రేసులో నిలిచి హిట్ స్టేటస్ అందుకుంది.
టాక్ కొంచెం అటూ ఇటూ ఉన్నా... నాగార్జున సినిమాకు హిట్స్ పడుతున్నాయి. దాంతో ప్రతి సంక్రాంతికి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో పక్కా ఒక మూవీ విడుదల చేయాలని భావిస్తున్నాడట. దీనిలో భాగంగా బంగార్రాజు 2 చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం నాగార్జున దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా చేస్తుండగా నాగార్జున కీలక రోల్ చేస్తున్నాడు. అలాగే అనిల్ అనే కొత్త దర్శకుడితో ఒక చిత్రం కమిట్ అయ్యాడట.
మరి జరుగుతున్న ప్రచారం నిజమైతే... చిరంజీవి-నాగార్జున సంక్రాంతి రేసులో పోటీపడనున్నారు. బంగార్రాజు మూవీ సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్. బంగార్రాజు మూవీలో నాగ చైతన్య, నాగార్జున కలిసి నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు.