వైరముత్తుకి ఓ న్యాయం, బ్రిజ్‌ భూషణ్‌కి మరో న్యాయమా?.. సీఎం స్టాలిన్‌ ని ప్రశ్నించిన చిన్మయి.. ట్వీట్స్ వైరల్‌

By Aithagoni RajuFirst Published May 30, 2023, 7:51 AM IST
Highlights

వైరముత్తుపై  మరోసారి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. మహిళలను వేధించినందుకుగానూ వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ని కోరింది చిన్మయి. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్  చేసింది.

తమిళ రచయిత వైరముత్తుని వదలడం లేదు సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి. గతంలో `మీటూ` సమయంలో వైరముత్తుపై తీవ్రమైన ఆరోపణలు చేసింది చిన్మయి. వైరముత్తు అనేక మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. సంచలనాలకు తెరలేపింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆయనపై విరుకుపడుతుంది. తాజాగా మరోసారి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను వేధించినందుకుగానూ వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ని కోరింది చిన్మయి. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్  చేసింది.

ఇందులో చిన్మయి చెబుతూ, బ్రిజ్‌ భూషణ్‌కైనా, వైరముత్తుకైనా రూల్స్ ఒకేలా ఉండాలి. ఒకరికి ఒక రంగా, మరొకరికి మరోలా ఉండకూడదని ఆమె వెల్లడించింది. రెజర్లని వేధించాడని బ్రిజ్‌ భూషణ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి స్టాలిన్‌, కమల్‌ హాసన్‌ లాంటి ప్రముఖులు స్పందించారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కమల్‌ హాసన్‌ని కౌంటర్‌ వేసింది చిన్మయి. తన కళ్ల ముందే కొన్ని సంఘటనలు జరిగినా కమల్‌ పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. ఇప్పుడు తమిళనాడు సీఎంని రిక్వెస్ట్ చేసింది. 

దీనిపై చిన్మయి ఇంకా చెబుతూ, బ్రిజ్‌ భూషణ్‌ తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్స్ తోపాటు ఒక మైనర్‌ సైతం వ్యాఖ్యలు చేసింది. మీ పార్టీలో సత్సంబంధాలు ఉన్న వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17మంది మహిళలు బహిరంగంగానే వెల్లడంచాం. దాంతో ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు. మాకున్న కలలతో పోలిస్తే అతడి టాలెంట్‌ ఏమీ గొప్పది కాదు. దయచేసి వైరముత్తు లాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోండి, దీంతో తమిళనాడులోని పని ప్రదేశాలు సేఫ్‌గా ఉంటాయని వెల్లడించింది చిన్మయి. 

సొంత ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురైన ఒక మహిళగా నేను ఈ రోజు మాట్లాడుతున్నా, ఎందుకంటే వైరముత్తుకు ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు వ్యతిరేకంగా నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయింది చిన్మయి. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే గత నెల రోజులుగా ఢిల్లీ లోని జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు ఆందోళ చేస్తున్నారు. తమని మానసికంగా, లైంగికంగా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వేధిస్తున్నారు వారంతా ఆరోపిస్తున్నారు.అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 23 నుంచి ఆందోళన చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించకపోవడంతో కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

 ఈ క్రమంలో అటు రెజ్లర్లకి, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. ఇది నేషనల్‌ వైడ్‌గా హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించారు. రెజ్లర్లకు మద్దతు ప్రకటిస్తూ, పోలీసుల తీరుని ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని టార్గెట్‌ చేస్తూ చిన్మయి స్టాలిన్‌కి ట్వీట్‌ చేయడం గమనార్హం. 
 

click me!