డెంగ్యూ ఫీవర్‌తో బాలనటుడు మృతి

By sivanagaprasad KodatiFirst Published Oct 18, 2019, 10:45 AM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే ఒక షోలో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు. 

తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే ఒక షోలో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఏవీ నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలి రెండవ కుమారుడైన గోకుల్ సాయి.. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు.

దీంతో తల్లిదండ్రులు బాలుడిని బెంగళూరులోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ సాయి గురువారం రాత్రి చనిపోయాడు. 

 

తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొద్దిరోజుల క్రితం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఆరోగ్య శ్రీ ట్రస్టు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో డెంగీ, ఇతర విష జ్వరాల ప్రభావం అందుబాటులో ఉన్న మందులు, తక్షణం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రోగులు తప్పకుండా టెస్టులు చేయించుకోవాలని సూచించామని ఈటల తెలిపారు.

వ్యాధి నిర్థారణ తేలితే సరైన వైద్యం సకాలంలో అందించొచ్చని... పీహెచ్‌సీ నుంచి ఉన్నతస్థాయి ఆస్పత్రుల వరకు అన్నింటిలోనూ మందులు అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన చోట ఎక్కువ మంది వైద్యులను అందుబాటులో ఉంచుతామన్నారు.

విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు సెలవులు తీసుకోకూడదని సూచించామని ఈటల వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలో డెంగీ , ఇతర విషజ్వరాల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రిపాలవుతుండటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తాజా పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 

డెంగ్యూ కేసులతో కర్ణాటక చివురుటాకులా వణికిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు 6,110 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఒక్క బెంగళూరు నగరంలోనే 3,882 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో దోమలు బాగా వృద్ధి చెందాయి.

 

డెంగ్యూ కారణంగా ఎంతో మందికి రక్తంలో ప్లేట్‌లెట్స్ శాతం పడిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్ధితి నానాటికి విషమిస్తుండటంతో ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి.

డెంగ్యూపై అవగాహన కల్పించడంతో పాటు పేదలకు అవసరమైన మందులను అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కార్పోరేట్ సంస్థ గోద్రేజ్ సైతం డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

దానితో పాటు ప్లేట్ లెట్స్ కావాల్సిన వారికి, ప్లేట్ లెట్స్ డోనర్లకు వారధిగా ఉండేందుకు ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

 

దీనికి మంచి స్పందన వస్తుండటంతో త్వరలోనే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లకు సైతం దీనిని విస్తరించేందుకు గోద్రేజ్ సన్నాహాలు చేస్తోంది.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం గోద్రేజ్ హెల్ప్‌లైన్ ద్వారా సాయం పొందిన వారి వీడియోను షర్ చేసింది. డెంగ్యూపై అవగాహన మరియు సహాయం కోసం 7878782020 నెంబర్‌కు సంప్రదించగలరు.

click me!