
కొన్ని తలనొప్పులు ఎప్పటికి తీరవు. మానిపోయిన గాయాన్ని రేపుతూనే ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్దితి లైగర్ టీమ్ కు ఎదురౌతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లైగర్'. అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా వల్ల తాము ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సినిమా వల్ల నష్టపోయిన వారికి సెటిల్ చేసేందుకు పూరీ జగన్నాథ్ గతంలో అంగీకరించారు. తాజాగా నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. లైగర్ సినిమాతో తమకు భారీ నష్టాలు వచ్చాయని, తమను ఆదుకోవాలని కోరుతూ నిరసన తెలిపారు. ఆర్థికంగా నష్టపోయిన తమకు పూరీ జగన్నాథ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ నేటి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సినీ నటి చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫిల్మ్ చాంబర్ కు మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించారు. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.