
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా కలెక్షన్లపై తాజాగా మరో వివాదం వినిపిస్తోంది. నిజానికి ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లపై సోషల్ మీడియాలో 100-120 కోట్లు అంటూ తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఖైదీ కలెక్షన్లు అంత సాధించలేదని... కేవలం 75 కోట్లు మాత్రమే సాధించిందని రామ్ చరణ్ స్వయంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఖైదీ నెంబర్ 150 కేవలం 75 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదించిందని చరణ్ అధికారులతో చెప్పారట. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్లు రామ్ చరణ్ చెప్పినట్లుగా అంతే అయితే.. లాభం 15 కోట్లు మాత్రమే అనుకోవాలి.
నిజానికి ఈ సినిమాకు చిరంజీవి తీసుకున్న పారితోషికం 20 కోట్ల రూపాయలు. దర్శకుడు వి.వి.వినాయక్ కూ నిర్మాత రామ్ చరణ్ 10కోట్ల రూపాయలు చెల్లించాడు. మొత్తానికి సినిమా కేవలం 15 కోట్లు మాత్రమే లాభాలను ఇచ్చిందని తెలిపిన రామ్ చరణ్ త్వరలోనే దానికి సంబంధించిన పన్ను కూడా చెల్లిస్తానని అధికారులకు చెప్పినట్లు సమాచారం.